Site icon NTV Telugu

Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు

Amaravati

Amaravati

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక వరద నియంత్రణ ప్రాజెక్టు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జోన్–8 పరిధిలోని ఉండవల్లి గ్రామం వద్ద పంపింగ్ స్టేషన్–2 నిర్మాణానికి సంబంధించిన టెండర్లను అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఖరారు చేసింది. వరదల సమయంలో 8,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ ద్వారా కృష్ణా నదిలోకి తరలించే లక్ష్యంతో ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాజధాని ప్రాంతంలో నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు శాశ్వత పరిష్కారం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

Read Also: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!

టెండర్లలో L1 బిడ్‌గా నిలిచిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థకు ఈ ప్రాజెక్టు పనులు అప్పగిస్తూ ADCL తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.443.76 కోట్ల అంచనా వ్యయంతో పంపింగ్ స్టేషన్–2 నిర్మాణాన్ని MEIL సంస్థ చేపట్టనుంది. ఈ పనుల్లో సర్వే, డిజైన్, నిర్మాణం మాత్రమే కాకుండా 15 ఏళ్ల పాటు స్టేషన్ కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు కూడా ఇదే సంస్థ నిర్వర్తించనుంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA), ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) సహకారంతో సమీకరించనుంది. రాజధాని మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఈ ఫండింగ్‌ను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

టెండర్ ఖరారు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ప్రాజెక్టు పనులు వేగంగా ప్రారంభించేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ADCL ఛైర్‌పర్సన్ అండ్ ఎండీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో వరద నియంత్రణకు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. పంపింగ్ స్టేషన్–2 నిర్మాణం పూర్తయితే, వర్షాకాలంలో అమరావతి పరిధిలో నీటి ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, కృష్ణా నదిలోకి వరద నీటిని సురక్షితంగా తరలించేందుకు మార్గం ఏర్పడుతుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పటికే చేపడుతున్న మౌలిక సదుపాయాలకు ఇది మరింత బలం చేకూర్చనుంది.

Exit mobile version