Site icon NTV Telugu

Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన అమల..

Amala

Amala

తెలుగు ప్రేక్షకులకు అమల అక్కినేని అంటే కేవలం ఒక నటి కాదు. శాంత స్వభావం, క్లాసికల్ డాన్స్‌లో ప్రావీణ్యం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కినేని కుటుంబంలో ఓ ఆదర్శ కోడలు.. ఇలా చాలా రోల్స్‌కి సింబల్‌గా నిలిచే వ్యక్తి. ’80–’90 దశకాల్లో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అమలా, చాలా అరుదుగా వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. అయితే, తాజాగా ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి తన బాల్యం, పుట్టింటి నేపథ్యం, తల్లిదండ్రుల స్ట్రగుల్, డ్యాన్స్ జర్నీ ఇవన్నీ చాలా హృదయానికి హత్తుకునేలా చెప్పారు.

Also Read :‘Kantara Chapter 1’: సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కాంతార చాప్టర్ 1’- 50 డేస్ సెలబ్రేషన్స్!

అమల మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు తల్లిదండ్రులే. నా జీవితాన్ని అలాగే వాళ్ళే తీర్చిదిద్దారు. మా నాన్నగారు ఈస్ట్ బెంగాల్‌ నుంచి పార్టిషన్ సమయంలో రాత్రికిరాత్రే ఇల్లు–ఆస్తి అన్నీ వదిలేసి, ఖాళీ చేతులతో ఉత్తర్ ప్రదేశ్‌లోని కన్నోజ్‌కి వచ్చేయాల్సొచ్చింది. అప్పుడాయన వయసు కేవలం 10 ఏళ్లు. వాళ్లు మొత్తం ఫ్యామిలీ పది మంది సంతానం. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. అలా స్కాలర్‌షిప్‌పై చదువుకుంటూ యూనివర్సిటీ చేరారు. అక్కడ మా అమ్మను కలిశారు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మా తల్లిదండ్రులు ఎవరినీ బాధ పెట్టరు వాళ్లకు ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవడం అస్సలు తెలియదు” అని చెప్పి అమలా భావోద్వేగానికి లోనయ్యారు.

వైజాగ్‌లో మొదలైన డ్యాన్స్ ప్రయాణం

“చిన్నప్పుడు మా కుటుంబం వైజాగ్‌లో ఉండేది. అప్పుడు నాకు ఏడు–ఎనిమిది ఏళ్లు. అప్పుడే భరతనాట్యం క్లాస్‌కి జాయిన్ అయ్యాను. డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడం నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించేది. మా గురువు నా ప్రతిభ చూసి ‘ఈ అమ్మాయిలో మంచి టాలెంట్ ఉంది చెన్నై కళాక్షేత్రలో పెంచితే ఇంకా ఎత్తుకి వెళ్లిపోతుంది’ అన్నారు. అమ్మ వెంటనే నన్ను చెన్నైకి తీసుకెళ్లి కళాక్షేత్ర మొత్తం చూపించారు. అలా అక్కడే హాస్టల్‌లో అడ్మిషన్ ఇచ్చి, స్కూల్–డ్యాన్స్ రెండూ ఒకేసారి కొనసాగించాను. ప్రతిరోజూ మూడు గంటలు క్రమంగా భరతనాట్యం ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇలా మొత్తం తొమ్మిది సంవత్సరాలు కళాక్షేత్రంలో గడిపాను.”

దేశ–విదేశాల్లో భారతీయ నృత్యాన్ని పరిచయం చేసిన అమల

“స్కూలింగ్, కాలేజీ పూర్తయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నో స్టేజ్ షోలలో పాల్గొన్నాను. విదేశాల్లో కూడా భారతీయ క్లాసికల్ డ్యాన్స్‌ను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇండియాను ప్రాతినిధ్యం వహించినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు ఇండియా అంటే ఎంత ఇష్టం అంటే. ఎక్కడికి వెళ్లినా నేనక్కడ అడ్జస్ట్ అయిపోగలను. అయిదు భాషలు కూడా వచ్చు అని నృత్యం వల్ల అయ్యింది” అని అమలా చిరునవ్వుతో చెప్పారు.

అమలా జీవితంలోని ఈ కథ విని నెట్‌జన్లు షాక్

అమలా ఇలా తన కుటుంబ స్ట్రగుల్, బాల్యం, కళాక్షేత్రలోని కష్టం, డ్యాన్స్ జర్నీ గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె వెనుక ఎంత పెద్ద ప్రయాణం ఉందో అందరూ ఇప్పుడు గ్రహిస్తున్నారు.

 

Exit mobile version