YCP Wins Alluri ZP Chairperson Post: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో గెలుపొందగా.. సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండానే జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ ఖాతాలో పడనుంది. అయితే మాజీ ఎంపీ మాధవి, మాజీ జెడ్పీ చైర్మన్ సుభద్ర ఓటమి వైసీపీకి ఊహించని పరిణామంగా మారింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యూహాలతో పాటు ఓటర్ల ఆలోచనా విధానం కూడా కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు ప్రయత్నించగా.. మన్యం ప్రాంత ఓటర్లు మాత్రం మరోసారి వైసీపీకి మద్దతు పలికారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 61.71 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ మొదలైనప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించిన విపక్షం విసిరిన సవాల్‌ను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ ఎంపీ మాధవి, మాజీ జెడ్పీ చైర్మన్ సుభద్ర పోటీ చేసిన ముంచంగిపుట్టు, కొయ్యూరు మండలాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టి పట్టున్న హుకుంపేట, జి. మాడుగుల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అరకులో కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో కూటమి నేతలు వ్యూహాలు రచించారు.
కూటమి పార్టీలు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినప్పటికీ.. తుది ఫలితాల్లో వైసీపీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో ఏడు జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఒడిశా సరిహద్దులోని ముంచంగిపుట్టు మండలంలో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. జెడ్పీటీసీలు కాకుండా నలుగురు ఎక్స్ ఆఫీషియో ఓట్లు వైసీపీకి ఉన్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ రవిబాబు ఓట్లు విపక్షానికి అదనపు బలం. దీంతో జెడ్పీ మీద వైసీపీ జెండా రెపరెపలు ఖాయం అయ్యాయి. మొత్తంగా జిల్లా జెడ్పీ పీఠం వైసీపీకి దక్కగా.. కీలక నేతల ఓటమి మాత్రం ఆ పార్టీకి షాక్‌గా మారింది.

