Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!

  • హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యంపై..
  • నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి
  • అర్ధరాత్రి వేళల్లోనూ అధిక శబ్దంతో మైకులు, లౌడ్‌స్పీకర్లు వినిపిస్తున్నాయని...
Alli Sirish

Alli Sirish

Allu Sirish: హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యంపై సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళల్లోనూ అధిక శబ్దంతో మైకులు, లౌడ్‌స్పీకర్లు వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమస్యపై హైదరాబాద్ సిటీ పోలీసులను సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.

షేక్‌పేటలోని అపర్ణా వన్ గేటెడ్ సొసైటీలో నివసిస్తున్న అల్లు శిరీష్.. తన నివాసానికి సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి గత కొన్ని రోజులుగా భారీ శబ్దంతో సంగీతం వినిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మైకుల శబ్దం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కారణంగా తమ అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని శిరీష్ తెలిపారు. శబ్ద కాలుష్య నిబంధనలను పాటించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఈ సమస్యపై ఇప్పటికే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ తెలిపారు. అయితే గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు సూచించినట్లు చెప్పారు.

సెప్టెంబర్ 25తో గణేశ్ నిమజ్జనం పూర్తయినప్పటికీ.. ఆలయం వద్ద మైకుల శబ్దం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదని తెలిపారు. అర్ధరాత్రి వరకు అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినిపించడం వల్ల ప్రజల నిద్రకు భంగం కలుగుతోందని శిరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, ఉదయం ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

శబ్ద కాలుష్యానికి సంబంధించిన నిబంధనలను పరిశీలించి, రాత్రి వేళల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను ఆయన కోరారు. అల్లు శిరీష్ ఫిర్యాదు సోషల్ మీడియాలో చర్చకు రావడంతో పలువురు నెటిజన్లు కూడా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యంపై స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని కొందరు పేర్కొంటూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.