అల్లు అరవింద్ అంటే ఒకప్పుడు ‘మెగా కాంపౌండ్’కు పునాది! నేడు తమ కాంపౌండ్ హీరోలతో పాటు ఎందరో కథానాయకులతో అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ సాగుతున్నారు అరవింద్. ‘గీతా ఆర్ట్స్ ‘ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించి విజయపథంలో సాగిన అల్లు అరవింద్, ‘గీతా ఆర్ట్స్ -2’ పేరుతో మరికొందరు వర్ధమాన నిర్మాతలతో కలసి చిత్రాలను నిర్మిస్తున్నారు. అలుపెరుగకుండా సాగడమే అరవింద్ విజయరహస్యం అంటారు సన్నిహితులు. కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ సక్సెస్ ను తన చంకన పెట్టుకున్నారనీ అంటారు కొందరు. ఏది ఏమైనా వర్ధమాన నిర్మాతలకు అల్లు అరవింద్ ఓ రోల్ మోడల్ అని చెప్పక తప్పదు.
ప్రఖ్యాత హాస్యనటులు అల్లు రామలింగయ్య తనయునిగా 1949 జనవరి 10న జన్మించారు అరవింద్. బాల్యం నుంచీ తండ్రి నటునిగా పడే తపనను గమనించారు అరవింద్. తొలుత తండ్రి బాటలోనే పయనించాలని భావించారు. అయితే తాను ఒకరి చిత్రాల్లో నటించడం కాదు, తానే చిత్రాలు నిర్మించే స్థాయికి చేరాలని అభిలషించారు అరవింద్. అందుకు తగ్గట్టుగానే ‘గీతా ఆర్ట్స్’ సంస్థ నెలకొల్పి, దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంట్రోతు భార్య’ చిత్రాన్ని నిర్మించి, నిర్మాతగా తొలి అడుగు వేశారు అరవింద్. ఆ పై దాసరి దర్శకత్వంలోనే ‘దేవుడే దిగివస్తే’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. వీటితో పాటు శివాజీగణేశన్ ‘బంగారుపతకం’, కమల్ హాసన్ ‘ఎత్తుకు పైఎత్తు’ వంటి అనువాద చిత్రాలనూ తెలుగువారికి అందించారు. చిరంజీవితో ‘యమకింకరుడు’ తీసి మెప్పించారు. ఆ తరువాత చిరంజీవిని స్టార్ గా నిలపడంలో “శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు,” వంటి చిత్రాల నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు.
ఓ చిత్రాన్ని ఏ బడ్జెట్ లో నిర్మించవచ్చు, దానిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళ వచ్చు. అన్న అంశాలలో అరవింద్ లా ఎవరూ ప్రణాళికలు అల్లలేరని ప్రతీతి. చిరంజీవిని ‘మెగాస్టార్’గా నిలపడంలోనూ అల్లు అరవింద్ కృషిని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నాటి స్టార్ హీరోస్ నడుమ చిరంజీవిని నిలపడానికి అరవింద్ ఎంత శ్రద్ధ వహించారో ఈ నాటికీ కథలుగా చెప్పుకుంటారు. చిరంజీవి ఓ సినిమా అంగీకరించగానే, దానిని ఏ తీరున తెరకెక్కించాలి అన్న అంశం మొదలు, నిర్మాణానికి ఎంత వ్యయం చేయాలి, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాలి అన్న ప్రణాళికలు రూపొందించి సదరు నిర్మాతలకు అందజేసేవారు. అంతేకాదు, ఏ సెంటర్ లో ఎలాంటి కటౌట్స్ పెట్టాలి అన్న అంశంలోనూ అరవింద్ పాత్ర ఉండేది అంటే ఆయన ఎంతలా శ్రమించేవారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. చిరంజీవికి, ఆయన అభిమానులకు అరవింద్ వారధిగా ఉండేవారు. అందుకే చిరంజీవితో గీతా ఆర్ట్స్ పతాకంపై అరవింద్ ఓ చిత్రం నిర్మిస్తున్నారంటే అభిమానులు అది తమ సొంత చిత్రంగా భావించేవారు. అరవింద్ కూడా అభిమానులను ఆనందింప చేసే ‘పసివాడి ప్రాణం, అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య’ వంటి చిత్రాలను తీసి అలరించారు. ఆ సినిమాలు ఇప్పటికీ అభిమానుల మదిలో ఆనందం వెదజల్లుతూనే ఉండడం విశేషం.
చిరంజీవిని మెగాస్టార్ గా నిలిపిన అరవింద్, మెగా కాంపౌండ్ కు కూడా రూపశిల్పి అని చెప్పక తప్పదు. ఒకప్పుడు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఒక్కరే వారి కుటుంబంలో నటుడు. అరవింద్ కూడా కొన్ని చిత్రాలలో కామెడీ రోల్స్ పోషించారే కానీ, ఏ నాడూ సీరియస్ గా నటనపై దృష్టి సారించింది లేదు. అయితే తమ కుటుంబంలోకి చిరంజీవి రాగానే, అరవింద్ నటకుటుంబాన్ని విస్తరించారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’తో హీరోగా జనం ముందు నిలిపిందీ ఆయనే, పవన్ ను దర్శకునిగా ‘జాని’తో పరిచయం చేసిందీ ఆయనే. ఇక పవన్ కు ‘జల్సా’ వంటి అదిరిపోయే హిట్ అందించింది కూడా ఆయనే. తన తనయుడు అల్లు అర్జున్ ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసి, తరువాత స్టైలిష్ స్టార్ గా ఎదగడానికీ దోహదపడిందీ అరవిందే. తన మేనల్లుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు కెరీర్ లోనే బిగ్ హిట్ గా ‘మగధీర’ను నిర్మించి ఇచ్చిందీ ఆయనే. వీరేకాదు చిరంజీవి కుటుంబానికి చెందిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి. వారినీ హీరోలుగా నిలపడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. వెరసి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ‘మెగా కాంపౌండ్’లో పలువురు హీరోలు తయారు కావడానికి అరవిందే కారణమని అందరికీ తెలుసు.
ఓ వైపు చిత్ర నిర్మాణం, మరోవైపు ‘ఆహా’ ఓటీటీ నిర్వహణ, తనయులు, బంధువుల చిత్రాల ప్లానింగ్ అన్నిటా అరవింద్ ఏదో విధంగా పాలుపంచుకుంటూ బిజీ బిజీగానే సాగుతున్నారు. అలుపెరుగని అరవింద్ ను చూసి సినీజనం ‘ఆహా’ అంటూ ఉంటారు, సాధారణ ప్రేక్షక లోకం ‘ఓహో’ అనీ అభినందిస్తూ ఉంటుంది. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.