అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌కు చెందిన ‘క్వెన్’ (Qwen) ఏఐ ఓపెన్-వెయిట్ మోడళ్లు గత ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. హగ్గింగ్ ఫేస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెటా (227 మిలియన్లు), ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్ (418 మిలియన్లు) వంటి దిగ్గజ సంస్థలను అధిగమించి క్వెన్ ప్రపంచంలోనే అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన ఏఐ మోడల్‌గా ఘనత సాధించింది.
అలీబాబా ఇప్పటివరకు 460కి పైగా ఏఐ మోడళ్లను ఓపెన్ సోర్స్ చేయగా, వీటి ఆధారంగా డెవలపర్లు దాదాపు 3 లక్షలకు పైగా కొత్త వెర్షన్లను తయారు చేశారు. ఓపెన్ మోడళ్లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి, కస్టమైజ్ చేయడానికి, కొత్త ఏఐ ఉత్పత్తులను రూపొందించడానికి వీలుండటంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు క్వెన్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో, సులభంగా అనుకూలంగా మార్చుకునే సాంకేతికతను అందించడం ద్వారా అమెరికా-చైనా మధ్య జరుగుతున్న ఏఐ పోటీలో అలీబాబా తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటోంది.
డెవలపర్లు తమ అవసరాలకు తగినట్లుగా ఏఐ మోడళ్లను ఫైన్-ట్యూన్ చేయడానికి క్వెన్‌ను ప్రధాన ఎంపికగా భావిస్తున్నారని హగ్గింగ్ ఫేస్ తన నివేదికలో పేర్కొంది. డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ వంటి ఇతర చైనీస్ ఏఐ సంస్థలు కూడా ఓపెన్-సోర్స్ వ్యూహంతో అమెరికాలోని ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి క్లోజ్డ్ మోడళ్ల స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ చైనా సంస్థల అభివృద్ధి మందగించకపోవడం గమనార్హం.
ఈ బలమైన నెట్‌వర్క్ అలీబాబాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. అలీబాబా తన క్వెన్ మోడళ్లను సొంత క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆగ్నేయాసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోని కార్పొరేట్ కస్టమర్లకు అందిస్తోంది. చైనీస్ ఏఐ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో మెటా, ఎన్విడియా వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు కూడా డెవలపర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఓపెన్ ఏఐ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

