Airtel 299 Plan: టెలికాం దిగ్గజాలాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ (Airtel) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూడా ఈ ప్లాన్ మాయమైంది. దీంతో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజువారీ డేటా ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఇకపై రూ.349 ప్లాన్ కనీస ధరతో అందుబాటులో ఉండే అన్‌లిమిటెడ్ ప్లాన్‌గా మారింది.
రూ.299 ప్లాన్‌లో ఏం లభించేవి?
నిలిపివేయడానికి ముందు ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా కోరుకునే వారికి ఉపయోగకరంగా ఉండేది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. ప్రతిరోజూ 1GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభించేవి. వీటితోపాటు ఎయిర్‌టెల్ హలో ట్యూన్స్, పర్ప్లేక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు కూడా ఉండేవి. అయితే తాజాగా ఈ రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ తన అధికారిక రీఛార్జ్ జాబితా నుంచి తొలగించింది. దీంతో రూ.300 లోపు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటాతో కూడిన ప్లాన్‌ను కోరుకునే ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ తగిలింది.
రూ.349 ప్లాన్:
రూ.299 ప్లాన్ తొలగింపుతో ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ డేటా ప్రయోజనాలు కలిగిన అత్యంత చౌకైన ప్లాన్‌గా రూ.349 రీఛార్జ్ మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. వీటితోపాటు ఈ ప్లాన్‌లో 6 నెలల ఆపిల్ మ్యూజిక్, 12 నెలల అడోబ్ ఎక్ష్ప్రెస్స్ ప్రీమియం, ఎయిర్‌టెల్ హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. అంటే రూ.299 ప్లాన్‌తో పోలిస్తే రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. రోజువారీ డేటా ప్రయోజనం 1GB నుంచి 2GBకి పెరుగుతుంది.
రూ.399 ప్లాన్:
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ కంటే పైస్థాయిలో రూ.399 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనంగా జియో హాట్ స్టార్ మొబైల్ తోపాటు ఇతర ఎయిర్‌టెల్ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
రూ.579, రూ.619 ప్లాన్స్:
రూ.299 ప్లాన్‌తో పాటు కొన్ని టెలికాం సర్కిళ్లలో రూ.579, రూ.619 ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ నిలిపివేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో ఈ ప్లాన్లు అందుబాటులో లేవని సమాచారం. అయితే ఈ రెండు ప్లాన్లను దేశవ్యాప్తంగా అధికారికంగా నిలిపివేసినట్లు ఎయిర్‌టెల్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. టెలికాం సర్కిల్‌ను బట్టి రీఛార్జ్ ప్లాన్ల లభ్యతలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు తమ ప్రాంతంలో ఏ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడం మంచిది.
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను మారుస్తుంటాయి. ఒకే విధమైన వ్యాలిడిటీ, ప్రయోజనాలతో ఉన్న అనేక ప్లాన్లను తగ్గించడం ద్వారా రీఛార్జ్ ఆప్షన్లను సులభతరం చేయడంతో పాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్రయోజనాలను అందించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. అదే సమయంలో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU)ను పెంచుకోవడం కూడా టెలికాం కంపెనీల వ్యూహాల్లో ఒకటిగా ఉంటుంది. ఎయిర్‌టెల్ కూడా గత కొంతకాలంగా తన ప్రీపెయిడ్ ప్లాన్లను తరచుగా సవరించడంతో పాటు డేటా, OTT, మ్యూజిక్, ప్రొడక్టివిటీ సబ్‌స్క్రిప్షన్లను బండిల్ చేస్తోంది.

