AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!

Aimim Azad Samaj Party

Aimim Azad Samaj Party

AIMIM-ASP Alliance: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో (UP Politics) ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని ఏఐఎంఐఎం (AIMIM), చంద్రశేఖర్ ఆజాద్ (Chandrashekhar Azad) నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) కలిసి కొత్త పొత్తును ప్రకటించాయి. ఈ కూటమికి ‘సామాజిక పరివర్తన మోర్చా’ (Social Parivartan Morcha) అని పేరు పెట్టారు. ఇది కేవలం మూడో కూటమి కాదని, సమాజంలో మార్పు తెచ్చే బలమైన వేదిక అని చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కాదు, స్వయంగా చంద్రశేఖర్ ఆజాదే అని ఒవైసీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ కొత్త కూటమి ప్రకటనతో సమాజ్‌వాదీ పార్టీ (SP) నేతల నిద్ర కరవైందని ఒవైసీ సెటైర్లు వేశారు. ముస్లిం ఓట్లను దండుకుంటున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వల్ల బీజేపీని ఓడించడం సాధ్యం కాదని విమర్శించారు. చంద్రశేఖర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం చూసి ఎస్పీ నాయకులకు కాళ్ల కింద భూమి దద్దరిల్లుతోందని ఎద్దేవా చేశారు. ఇక తన భద్రత గురించి అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భద్రత తీసేసినా తన గళాన్ని ఆపలేరని, ఈ పోరాటం కోసం ప్రాణాలొదలాల్సి వచ్చినా ఆ సౌదీ చాలా చౌకైనదేనని ఘాటుగా స్పష్టం చేశారు. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ (Assembly Seats) తమ పార్టీలు సత్తా చాటుతాయని చంద్రశేఖర్ తేల్చిచెప్పారు. బీజేపీపై (BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఒవైసీ, ఆ పార్టీని కేవలం పండుగల పార్టీగా అభివర్ణించారు. కిష్టవార్ ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు చనిపోతే బీజేపీ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే, కోలుకున్నాక రాజకీయంగా తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

ఇక ప్రస్తుత ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన తరగతులు (Backward Classes), ముస్లింలపై జరుగుతున్న అణచివేతపై చంద్రశేఖర్ ఆజాద్ మండిపడ్డారు. షబ్బీర్‌పూర్ ఘటనలో ఎలాంటి తప్పు లేకపోయినా తనపై 9 నెలలు జైలు శిక్ష విధించి, ఎన్‌ఎస్‌ఏ (NSA) పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్షీరామ్ సిద్ధాంతాలను గుర్తుచేస్తూ… బహుజన సమాజం ఇప్పుడు ఎవరికో చేయి చాచేలా కాకుండా, సమాజానికి ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని (Constitution), రిజర్వేషన్లను (Reservations) తుడిచిపెట్టాలని చూస్తున్నాయని, కానీ తాము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని హెచ్చరించారు. బీజేపీని గద్దె దించేందుకు తమ మనసు పెద్దదని చెబుతూ.. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమతో కలిసి రావొచ్చని ఆహ్వానించారు. గత ఎన్నికల్లో బహుజనులను నమ్మించి మోసం చేశారని, పేదల బస్తీల్లో కనీస వసతులు కూడా కరవయ్యాయని ఆజాద్ విమర్శించారు. 2014, 2017, 2022, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ విపక్షాలు కేవలం వాగ్దానాలు మాత్రమే చేశాయని, కానీ సరైన నాయకత్వం, గట్టి పట్టు లేకపోవడం వల్లే బీజేపీ మరింత బలపడిందని అన్నారు. ఇక, 2027 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కచ్చితంగా అధికార మార్పు (Power Change) చేసి తీరుతామని ఈ కొత్త కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.