ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఏపీ క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్‌శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది.
జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో రాజధాని నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఇవాళ సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో రాజధాని నిర్మాణ పనులకు నిధులను విడుదల చేయనున్నారు. ఈ ఒప్పందం కోసం హడ్కో సీఎండీ సంజయ్ కుల్‌శ్రేష్ఠ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఆయనకు పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపీ బాలశౌరి ఘన స్వాగతం పలికారు.