Agra Videographer Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ వీడియోగ్రాఫర్‌ని హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్‌లో నది ఒడ్డుకు తీసుకువచ్చి, నిప్పంటించారు. మృతదేహాన్ని ఎంతలా కాలిపోయిందంటే.. కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోయారు. కానీ పోలీసులు కష్టపడి 19 నెలల తర్వాత ఈ హత్య మిస్టరీని ఛేదించారు. ఈ హత్య వెనుక గల కారణం, పలు హత్య వివరాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Trump: ఆ పత్రిక అత్యంత చెత్తది.. న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ 15 బిలియన్ల దావా
ఆగ్రాలోని మల్పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 2024 ఫిబ్రవరి 18 రాత్రి ఈ ఘటన జరిగింది. రాకేష్ అనే వీడియోగ్రాఫర్‌ని దేవి రామ్ అనే 45 ఏళ్ల వ్యక్తి చంపేశాడు. దేవీ రామ్ కుమార్తెతో రాకేష్‌కు సంబంధం ఉందని పోలీసు దర్యాప్తులో తేలింది. రాకేష్ ఆమెకు సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు ఫొటోలు తీశాడనే సమాచారం తెలియగానే.. తట్టుకోలేక పోయాడు తండ్రి. రాకేష్‌కు సమాధి కట్టాలని ప్లాన్ చేశాడు. దేవి రామ్ రాకేష్‌ను దుకాణానికి పిలిచి మఫ్లర్, ఇనుప తీగతో వెనుక నుంచి గొంతుకు బిగించి చంపాడు. హత్య అనంతరం తన మేనల్లుడు నిత్య కిషోర్‌ను పిలిచి, ఇద్దరూ కలిసి రాకేష్ మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్‌లో వేశారు. రాత్రి చీకటిలో ఆ డ్రమ్‌ను లోడర్‌లో వేసుకుని ఖరీ నది సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. సాక్ష్యాలను నాశనం చేయడానికి మృతుడి మొబైల్, మఫ్లర్, వైర్‌ను నదిలోకి విసిరి, బైక్‌ను హైవేపై వదిలివేశారు.
ఫిబ్రవరి 20, 2024న ఆ ప్రాంతంలో పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని కనుగొన్నారు. దానిని గుర్తించడం కష్టంగా మారింది. అయితే, రాకేష్ అదృశ్యంపై అప్పటికే ఫిర్యాదు అందడంతో వారి కుటుంబీకులను పిలిపించారు. వాళ్లు కూడా మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. కానీ, పోలీసులు పట్టు వదలలేదు. మృతదేహం DNA నమూనాలను తీసుకున్నారు. ఇది రాకేష్ తల్లి DNAతో సరిపోలింది. సాంకేతిక దర్యాప్తు, నిఘా సహాయంతో పోలీసు బృందం ప్రధాన నిందితుడు దేవి రామ్‌ను సెప్టెంబర్ 15, 2025న అరెస్టు చేసింది. విచారణలో, అతను తన నేరాలను అంగీకరించాడు. అతని మేనల్లుడు నిత్య కిషోర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
