Site icon NTV Telugu

Chandrababu Arrest: సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్‌.. ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’

Sidharth Luthra

Sidharth Luthra

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.. అయితే, ఆయన బెయిల్‌ కోసం, మరోవైపు హౌస్‌ రిమాండ్‌ కోసం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌ (X).. ఆసక్తికరంగా మారింది.. స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ట్వీట్‌ చర్చకు దారిసింది.. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది” అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.. ‘ఈరోజు ఇదే మా నినాదం’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు నెగిటివ్‌ కామెంట్లు కూడా రాసుకొస్తున్నారు.

కాగా, ఈ రోజు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే, చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు.. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. మరోవైపు.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Exit mobile version