Site icon NTV Telugu

CM Revanth Reddy : పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం.. సీఎం రేవంత్‌తో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చలు

Adani

Adani

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. బుధవారం సెక్రెటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ, గౌతమ్ అదాని పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు.

 

ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసిమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version