NTV Telugu Site icon

Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు

Adani

Adani

ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది. దీనికి సుప్రీం అనుమతినివ్వడంతో ఈ నెల చివరిలో సెబీ ఆ వివరాలను సుప్రీంకు అందించనుంది.

ఇదిలా వుండగా అప్పటి నుంచి అదానీ గ్రూప్ తన వ్యాపార విస్తరణ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటూ, మరికొన్ని కొత్త వ్యాపారాలను టేకోవర్ చేస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆరోపణల కారణంగా కొంత నష్టపోయిన సంస్థ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా వుండగా క్వింటిలియన్ బిజినెస్ మీడియా(BQ ప్రైమ్)లో గతేడాది మార్చిలో 49 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు మిగిలిన 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. గతేడాది మార్చిలో ఇందులో 49 శాతం వాటాను రూ. 47.84 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని కైవసం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న జరిగిన వార్షిక సమావేశంలో అదానీ కంపెనీ బోర్డు డైరెక్టర్లు, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్ మధ్య బైండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ జరిగినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది.

Also Read: Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది

BQ ప్రైమ్ ను ఒకప్పుడు బ్లూమ్‌ బెర్గ్ క్వింట్ అని పిలిచేవారు. ఇది US-ఆధారిత ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ మీడియా, రాఘవ్ బాహ్ల్ క్వింటిలియన్ మీడియాతో జాయింట్ వెంచర్ లా ఉండేది. అయితే గతేడాది మార్చిలో ఈ ఒప్పందం నుంచి బ్లూమ్‌బెర్గ్ వైదొలగింది. ఇక BQ ప్రైమ్ తో పాటు డిసెంబర్ 2022లో NDTVలో దాదాపు 65 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అయితే అదానీ గ్రూప్ మొదట కొనుగోలు చేసిన మీడియా సంస్థగా BQ ప్రైమ్ ను పేర్కొనొచ్చు.