Actress Ramya: నటి రమ్య కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె, ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉన్నారు. అయితే సినిమాలపై ఆసక్తి మాత్రం తగ్గలేదు. తిరిగి చిత్రరంగంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఓ సినిమా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. రాజకీయాల నుంచి దూరమైనప్పటికీ, సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే.. రమ్య జంతు ప్రేమికురాలు. ముఖ్యంగా మూగజీవుల హక్కుల విషయంలో ప్రత్యేకంగా వీధి కుక్కల సమస్యలపై ఆమె తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అవసరం అనిపించిన ప్రతిసారీ జంతువుల తరఫున గళమెత్తడం ఆమెకు కొత్తేం కాదు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రమ్యాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు, వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. “ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యం. వీధి కుక్కల మూడ్‌ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు” అంటూ, అందుకే అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై నటి రమ్యా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఘాటైన ఉపమానం ఇచ్చారు. “మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. అలాంటప్పుడు పురుషులందరినీ జైలులో పెట్టేయాలా?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ద్వారా కాటేసే కుక్కలు, సౌమ్యమైన కుక్కలను వేరు చేయడం కష్టం అనే కారణంతో అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. మగాళ్లను కుక్కలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రమ్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రమ్య స్పందన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కల సమస్యను పురుషులతో పోల్చడంపై చర్చ మొదలైంది.
