Actress Celina Jaitly React on Kolkata Doctor Rape: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 8న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ హత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇప్పటికే ఆలియా భట్, సారా అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ స్పందించగా.. తాజాగా సెలీనా జెట్లీ స్పందిస్తూ తాను బాల్యంలో ఎదుర్కొన్న పీడ సంఘటలను గుర్తుచేసుకున్నారు. స్కూలులో చదివే రోజుల్లో అబ్బాయిలు వేధిస్తున్నారని టీచర్లకు చెబితే.. తననే తప్పు పట్టేవారు అని చెప్పారు. మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాలో సెలీనా జెట్లీ నటించిన విషయం తెలిసిందే.
42 ఏళ్ల సెలీనా జెట్లీ తన బాల్యంలోని వేదనను ఎక్స్ వేదికగా పంచుకొన్నారు. ‘అప్పుడు నేను ఆరవ తరగతి చదువుతున్నాను. మా స్కూలుకు సమీపంలో ఉన్న ఓ యూనివర్సిటీలోని విద్యార్థులు రిక్షాలో వెళుతున్న నా వెంటపడుతూ చాలా అల్లరి చేసేవారు. నేను స్కూలు నుండి బయటకు వచ్చే వరకు వేచి ఉండేవారు. నా దృష్టిని ఆకర్షించడానికి రహదారి మధ్యలో నాపై గులకరాళ్లు విసిరేవారు. ఈ విషయాన్ని మా టీచరుకు చెబితే.. నీ వస్త్రధారణ మరీ పాశ్చాత్య ధోరణిలో ఉంది. వదులుగా ఉన్న దుస్తులు ధరించి.. తలకు నూనె పెట్టుకొని రెండు జడలు వేసుకో. ఇది నీ తప్పే అని నన్నే తప్పుబట్టారు. ఓరోజు స్కూలు రిక్షా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఓ వ్యక్తి నా ఎదురుగా వచ్చి.. తన ప్రైవేట్ పార్ట్ చూపించాడు. ఇది నా తప్పేనేమో అని నేను చాలా ఏళ్లు కుమిలిపోయా’ అని సెలీనా జెట్లీ పేర్కొన్నారు.
Also Read: T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
’11వ తరగతికి వచ్చినా నాకు వేధింపులు ఆగలేదు. నా టూవీలర్ వైర్లు కత్తిరించి.. దానిపై ఏవేవో రాసేవారు. మళ్లీ టీచరుకు చెబితే.. “నువ్వు మోడరన్ టైపు. జీన్స్ వేసుకుంటావ్. స్కూటీ నడుపుతావు. జుట్టు వదులుగా వదిలేస్తావు. అందుకే నీది లూజ్ క్యారక్టర్ అని అబ్బాయిలు అనుకుంటున్నారు” అని మరోసారి నన్నే తప్పుబట్టారు. ఓరోజు నా స్కూటీ బ్రేక్ వైర్లు కత్తిరిస్తే కింద పడ్డాను. అప్పుడు తీవ్రంగా గాయపడ్డాను. అయినా నాదే తప్పు. అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలకు చెబుతారే కానీ.. అత్యాచారాలు చేయవద్దని అబ్బాయిలకు ఎవరూ చెప్పని సమాజంలో మనం బతుకుతున్నాం. మహిళలైన మనం తప్పు చేయలేదని ధైర్యంగా నిలబడి.. మన రక్షణహక్కు కోసం గళమెత్తాల్సిన తరుణం ఇదే’ అని సెలీనా జెట్లీ పిలుపునిచ్చారు. ఈ పోస్టుకు సెలీనా తాను ఆరో తరగతి చదువుతున్నప్పటి ఫొటోను షేర్ చేశారు.
