NTV Telugu Site icon

Vijay Thalapathy: నీట్‌ పరీక్షను రద్దు చేయాలి.. స్టాలిన్‌ సర్కారుకు దళపతి మద్దతు

Tvk Vijay

Tvk Vijay

Vijay Thalapathy: నీట్‌ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్‌ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్ష లీక్ కారణంగా విశ్వసనీయతను కోల్పోయిందన్నారు.

ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధులతో భేటీ అయిన టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్.. అనంతరం ప్రసంగించారు. తమిళనాడులోని విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, అణగారిన తరగతుల విద్యార్థులు నీట్‌ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారనేది వాస్తవమని ఆయన చెప్పారు. ఈ నీట్ పరీక్షకు సంబంధించి మూడు అంశాలు ముఖ్యమైనవన్నారు. ఒక దేశం, ఒక సిలబస్, ఒక పరీక్ష ప్రాథమికంగా విద్య యొక్క ఉద్దేశ్యానికి వ్యతిరేకమన్నారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా విద్యాబోధన జరగాలన్నారు. తాను కేవలం రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడటం లేదని.. విద్యావ్యవస్థలో విభిన్న దృక్కోణాలు, విభిన్న అభిప్రాయాలు ఉండాలన్నారు. దానికి ప్రాముఖ్యత ఇవ్వాలని, వైవిధ్యం పేదరికం కాదని, అది బలమని విజయ్ వెల్లడించారు.

Read Also: Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత

మీరు రాష్ట్ర భాష, రాష్ట్ర సిలబస్‌లో చదివి, NCERT సిలబస్‌లో పరీక్ష రాస్తే అది ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, ముఖ్యంగా మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇది ఎంత కష్టమో కూడా పరిగణించాలన్నారు. గత మే 5వ తేదీన జరిగిన పరీక్ష, ఆ తర్వాత జరిగిన నీట్‌ అవకతవకల వార్తలను చూశామని.. ఆ తర్వాత నీట్ పరీక్షపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. ఈ సంఘటనల ద్వారా దేశవ్యాప్తంగా నీట్ అవసరం లేదని తాము అర్థం చేసుకున్నామన్నారు.

దీనికి పరిష్కారం ఏంటంటే… నీట్ రద్దు ఒక్కటే తక్షణ పరిష్కారమన్నారు. నీట్ రద్దు కోరుతూ తమిళనాడు శాసనసభ తీసుకొచ్చిన తీర్మానాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో జాప్యం చేయవద్దని, తమిళనాడు ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, వారికి విలువనిచ్చి, వెంటనే ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమన్నారు. దానితో సమస్యలు ఉంటే, మధ్యంతర పరిష్కారంగా, భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. విద్య, ఆరోగ్యంతో సహా ప్రత్యేక పబ్లిక్ జాబితాను రూపొందించాలన్నారు.

ప్రస్తుత సాధారణ జాబితా సమస్య ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాలకు దానిపై ఉన్న అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వాలకు విద్య విషయంలో పూర్తి స్వాతంత్ర్యం కల్పించాలని వినయపూర్వకమైన విన్నపమని టీవీకే పార్టీ అధినేత విజయ్ కోరారు. కేంద్రప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న ఎయిమ్స్‌, జిప్‌మార్‌ వంటి మెడికల్‌ కాలేజీలకు నీట్‌ పరీక్ష నిర్వహించాలని భావిస్తే.. వాటిని నిర్వహించనివ్వండి అంటూ వెల్లడించారు.