టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు. ముఖ్యంగా ‘బాహుబలి 2’లో కుమారవర్మ పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అయితే ఆయన కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, పెళ్లి విషయంలో మాత్రం చాలా ఏళ్లు సైలెంట్‌గా ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో అనూహ్యంగా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సుబ్బరాజు, అసలు తను ఎందుకు ఇంత లేటుగా పెళ్లి చేసుకున్నారో.. నేటి కాలంలో విడాకులు ఎందుకు పెరుగుతున్నాయో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్‌తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాలామంది వయసు అయిపోతుందనో లేక ఇంట్లో వాళ్ల ఒత్తిడి వల్లనో పెళ్లి చేసుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. పెళ్లి అనేది నీకు ఏదో వస్తుందని చేసుకునేది కాదు.. నువ్వు నీ భాగస్వామికి ఏమి ఇవ్వగలవు అనే దానిపై ఆధారపడి ఉండాలి’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పెళ్లిళ్లు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం భాగస్వామిపై పెట్టుకునే భారీ అంచనాలే అని ఆయన కుండబద్దలు కొట్టారు. “నా భార్య ఇలా ఉండాలి.. నా భర్త ఇలా ఉండాలి అని ఊహించుకుంటారు. తీరా పెళ్లి అయ్యాక వాస్తవం అలా లేకపోతే మనస్పర్థలు మొదలై విడాకుల వరకు వెళ్తున్నాయి. అందుకే నా సర్వస్వం నా భార్యకు ఇవ్వగలను అనే నమ్మకం వచ్చాకే నేను పెళ్లి చేసుకున్నాను” అని సుబ్బరాజు చెప్పుకొచ్చారు. నేటి సమాజంలో పెళ్లి చుట్టూ జరుగుతున్న వివాదాలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో సుబ్బరాజు చేసిన ఈ ‘మెచ్యూర్డ్’ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలేషన్ అనేది ప్రేమతో పాటు బాధ్యతతో కూడుకున్నదని ఆయన ఇచ్చిన వార్నింగ్ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
