హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రాజమండ్రి సమీపంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదానికి ముందు 12 సెకండ్ల ముందు ఏం జరిగింది?, ఆ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ఆధారంగా జరిగిన పరిణామాలపై పోలీసుల దృష్టి కేంద్రీకృతమైంది. ఇంతకుముందు బైక్ వెనుక ఐదు వాహనాలు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ రికార్డింగ్ తేల్చగా.. ఈ వాహనాల గురించి వివరాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదమా? పన్నాగమా? అని ఈ క్రైమ్ మిస్టరీ పలు చర్చలకు దారి తీస్తోంది.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ప్రవీణ్ చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన విచారణ చేయిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత తెలిపారు. డీఎస్పీ స్థాయి పోలీసు అధికారుల కమిటీ ఈ కేసును విచారణ చేస్తోందన్నారు.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ (45) సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు సోమవారం సాయంత్రం ఆయన తన బైక్‌పై బయల్దేరారు. మంగళవారం ఉదయం రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన విగతజీవిగా పడి ఉన్నారు.ఆయనను ఓ కానిస్టేబుల్ గుర్తించి.. స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. ప్రవీణ్ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం జరిగింది.