ACB Raids: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీగా సోదాలు చేపడుతున్నారు. మల్టీ జోన్-2లో ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.
ఛత్రినాక ప్రాంతంలోని నరహరి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నరహరి నివసిస్తున్న మొదటి అంతస్తుతో పాటు కింది అంతస్తులో నివసిస్తున్న ఆయన సోదరుడి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా నరహరి కార్యాలయం, బంధువుల ఇళ్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపడుతున్నాయి. ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో సుమారు 10 బృందాలు వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నరహరి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండగా, అధికారులు వారికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
సోదాల సందర్భంగా ఇప్పటికే కొన్ని కీలక పత్రాలతో పాటు బంగారం, ఇతర విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నరహరిని కూడా ప్రశ్నిస్తూ ఆయన ఆస్తుల మూలాలపై వివరణలు తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా నరహరిపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రత్యేక దర్యాప్తు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలను గుర్తించిన అనంతరం ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు సోదాలు ముగిసిన తర్వాత అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

