Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..

Abhishek Sharma

Abhishek Sharma

షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లోనే అమృతసార్ సూర్మస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమన్ దీప్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, అమృతసార్ కెప్టెన్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఓపెనర్ సహజ్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్, తొలి వికెట్‌కే శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సహజ్ కేవలం 18 బంతుల్లోనే 45 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడు అవుట్ అయ్యే సమయానికి అమృతసార్ జట్టు 5.1 ఓవర్లలోనే 100 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే చివరి బంతికి ఫోర్ కొట్టి కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా ఆయుష్ గోయల్ వేసిన ఐదో ఓవర్‌లో ఏకంగా 6 సిక్సర్లు బాది మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 296కి పైగా స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మొదటి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం తర్వాత, నమన్ ధీర్‌తో కలిసి రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించాడు. చివరకు హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 9వ ఓవర్ మూడో బంతికి అభిషేక్ అవుటయ్యాడు.

అనంతరం నమన్ ధీర్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 22 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 47 పరుగులు చేసి, తేజ్‌ప్రీత్ సింగ్ బౌలింగ్‌లో అవుటై తృటిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. 14వ ఓవర్ మూడో బంతికి రాహుల్ కుమార్ రూపంలో నాలుగో వికెట్ పడేసరికి అమృతసార్ స్కోరు 211 పరుగులకు చేరింది. ఆ సమయంలో ఇంకా 39 బంతులు మిగిలి ఉండటంతో జట్టు స్కోరు 280 దాటుతుందని భావించారు. అయితే చివరి ఓవర్లలో మొహాలీ కింగ్స్ బౌలర్లు వరుస వికెట్లు తీసి పుంజుకున్నప్పటికీ, అమృతసార్ సూర్మస్ నిర్ణీత ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.