Abhimanyu Easwaran Awaits for Debut since 2021: భారత జట్టులో అరంగేట్రం కోసం క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2021లో టీమిండియాలో భాగం అయినా.. నాలుగు సంవత్సరాలుగా అరంగేట్రం నోచుకోలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అభిమన్యు ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు బాదాడు. అయినప్పటికీ ఆండర్సన్-టెండ్యూలర్ ట్రోఫీలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు నాలుగు టెస్టుల్లో చోటు దక్కని అభిమన్యుకు చివరి టెస్టులో సైతం ప్లేయింగ్ 11లో స్థానం కష్టమే. అరంగేట్రం కోసం అతడు ఇంకెన్ని రోజులు వేచి ఉండాలో మరి.
అభిమన్యు ఈశ్వరన్ 2021లో తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించి.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడంతో అతనికి అవకాశం రాలేదు. రోహిత్ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. భారత జట్టులో పెను మార్పులు జరిగినా.. అభిమన్యుకు ఇప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లాడు కానీ.. ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయాడు. ఈ నాలుగేళ్లలో 16 మంది ఆటగాళ్లు భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. అంతెందుకు కొద్ది రోజుల క్రితమే జట్టులోకి వచ్చిన ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ కూడా అరంగేట్రం చేశాడు.
శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్, అన్షుల్ కాంబోజ్.. ఈ నాలుగేళ్లలో భారత టెస్ట్ జట్టులో ఆడారు. అభిమన్యు ఈశ్వరన్ మాత్రం ఇంకా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్ కాగా.. శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు దూరమయ్యారు. ఈ సమయంలోనే అభిమన్యు అరంగేట్రం చేయలేదంటే.. మరి ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో. మొన్న ఐపీఎల్ టోర్నీలో ఆడిన సాయి సుదర్శన్ కూడా అరంగేట్రం చేయడం ఇక్కడ విశేషం.
Also Read: BTech Ravi: ఎస్ఎస్ రాజమౌళి డైలాగులు ఎందుకు?.. సతీష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్!
అభిమన్యు ఈశ్వరన్ 1995 సెప్టెంబర్ 6న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో తన సొంత రాష్ట్రం తరపున కాకుండా.. బెంగాల్ తరపున ఆడుతున్నాడు. అభిమన్యు ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.70 సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 89 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 47.03 సగటుతో 3857 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు బాదాడు. 34 టీ20 మ్యాచ్‌లలో 37.53 సగటుతో 973 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు.
