Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..

Abhijeet Dipke

Abhijeet Dipke

దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే చాలామంది ఉద్యోగాలు, చదువుల వల్ల ఇళ్లకు దూరంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటి వారి కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. అమెరికాలో కుటుంబానికి దూరంగా తాను జరుపుకున్న రెండు దీపావళి పండుగల జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

విదేశాల్లో ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా పండుగ చేసుకోవడం ఎంత బాధాకరంగా ఉంటుందో తనకు తెలుసని ఆయన అన్నారు. ఇళ్లకు దూరంగా ఉన్నవారందరికీ తన ప్రేమను అందిస్తూ, రాబోయే తదుపరి దీపావళిని వారంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ శుభాకాంక్షల్లో భాగంగా ఆయన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, పోలీసులు, వైద్య సిబ్బంది, ఎయిర్‌లైన్స్, రైల్వే, రోడ్డు రవాణా ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, పనుల కోసం వచ్చిన వలస కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజం కోసం పండుగ రోజున కూడా తమ ఇళ్లకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు.

అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. విదేశాల్లో సుదీర్ఘకాలం గడిపిన అనుభవం ఉండటంతో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, పండుగ వేళ ఇంటికి దూరంగా ఉండే వారి బాధను మానవీయ కోణంలో అర్థం చేసుకుంటూ ఈ సందేశాన్ని ఇచ్చారు. కాగా, శనివారం నాడు ఆయన కేరళలోని కొచ్చిలో ఓ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ని అడ్డంకులు, దాడులు ఎదురైనా దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తన యాత్రను కొనసాగిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.