Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..

Abhijeet Dipke

Abhijeet Dipke

Abhijeet Dipke: గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ఒక వైవిధ్యమైన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను గురువారం సాయంత్రం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక, తన మద్దతుదారులతో కలసి ప్లకార్డులు పట్టుకుని మెరైన్ డ్రైవ్ వద్ద సందడి చేస్తున్న అభిజీత్‌ వద్దకు ఒక మహిళా ఇన్‌‌స్పెక్టర్ నాయకత్వంలోని పోలీస్ టీమ్ వెళ్లింది. ఆయనను పోలీస్ వ్యాన్ ఎక్కించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ మహిళా అధికారి అభిజీత్ వివరాలు, సొంత ఊరు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై ముంబై పోలీసుల వెర్షన్ వేరేలా ఉంది. తాము అభిజీత్‌ను అసలు అరెస్ట్ కానీ, నిర్బంధించడం కానీ చేయలేదని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మెరైన్ డ్రైవ్ వద్ద ప్రజలను కలుస్తూ, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే మాట్లాడటానికి మాత్రమే స్టేషన్‌కు తీసుకెళ్లామని అధికారులు స్పష్టం చేశారు.

అయితే, అభిజీత్ దిప్కే మాత్రం ఈ ఉదంతంపై పోలీసులతో విభేదిస్తూ పూర్తి భిన్నమైన కథనాన్ని వినిపించారు. ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ తన వద్దకు వచ్చి “పదండి.. ఒక టీ తాగుదాం, మీకు మా వద్ద ‘చాయ్’ బాకీ ఉంది” అని చెప్పి మరీ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన అన్నారు. కానీ, తీరా స్టేషన్‌కు తీసుకెళ్లాక టీ ఇవ్వకపోగా, కేవలం తన విలువైన సమయాన్ని వృథా చేయడానికే పోలీసులు ఇలా చేశారని అభిజీత్ ఆరోపించారు. పైఅధికారుల నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి ఉంటాయేమో, అందుకే తనను ఏమీ అనకుండానే పంపించేశారని వ్యాఖ్యానించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక, ఆయన చెంబూరులోని అంబేడ్కర్ హాస్టల్‌లో విద్యార్థులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అసలు ఈ రచ్చంతా అక్టోబర్ 2న సీజేపీ చేపట్టిన నిరసన చుట్టూనే తిరుగుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసనను తలపెట్టారు. అయితే, ప్రసిద్ధ శివాజీ పార్క్ వద్ద జనసమీకరణపై ఉన్న ఆంక్షలు, స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి లేకపోవడం, ట్రాఫిక్ సమస్యలతో పాటు అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందనే కారణాలతో ముంబై పోలీసులు ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.