Site icon NTV Telugu

AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌!

Ab De Villiers

Ab De Villiers

క్రికెట్ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ నాలుగు సంవత్సరాల తర్వాత బ్యాట్ పట్టేందుకు సిద్దమయ్యాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్‌) టోర్నీలో తాను బరిలో దిగనున్నట్లు ఏబీడీ స్వయంగా ప్రకటించాడు. అంతేకాదు డబ్ల్యూసీఎల్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపాడు. డబ్ల్యూసీఎల్‌ రెండవ ఎడిషన్‌లో గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు ఏబీడీ నాయకత్వం వహిస్తాడు. తాను మైదానంలోకి బరిలోకి దిగుతున్నట్లు మిస్టర్ 360 ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంతోషపడిపోతున్నారు.

‘ఇకపై ఆడాలనే కోరిక లేకపోవడంతో నాలుగు సంవత్సరాల క్రితం నేను క్రికెట్ నుండి రిటైర్ అయ్యాను. సమయం గడిచింది. ఇప్పుడు నా కుమారులు ఆడడం ప్రారంభించారు. మేము గార్డెన్‌లో తరచుగా ఆడుతున్నాము. నా పిల్లలు మళ్లీ క్రికెట్‌ ఆడేలా ప్రేరేపించారు. అందుకే నేను జిమ్, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్‌ కోసం నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. గేమ్ ఛేంజర్స్ సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ వ్యవస్థాపకుడు అమన్‌దీప్ సింగ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ తిరిగి రావడం జట్టులో ఉత్సాహం నెలకొందని, జట్టు కచ్చితంగా ఉత్తమ ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏబీ డివిలియర్స్‌ దక్షిణాఫ్రికా తరఫున 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్‌లో 114 టెస్టు మ్యాచ్‌లలో 8765 పరుగులు, 228 వన్డేల్లో 9577 రన్స్‌, 78 టీ20 మ్యాచ్‌లలో 1672 పరుగులు చేశాడు. ఏబీడీ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే సెంచరీలు చేశాడు. కుటుంబంతో కలిసి సమయం గడిపేందుకు 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరలా టీ20 టోర్నీ ఆడేందుకు సిద్దమయ్యాడు. డబ్ల్యూసీఎల్‌ ఒక ప్రీమియర్‌ టీ20 టోర్నమెంట్‌. ఇందులో రిటైర్‌ అయిన, నాన్‌ కాంట్రాక్ట్‌ క్రికెట్‌ దిగ్గజాలు ఆడతారు. మొదటి ఎడిషన్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది.

 

Exit mobile version