NTV Telugu Site icon

Kejriwal: ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ ఇచ్చిన ఆఫర్ ఇదే!

Kejriwal

Kejriwal

ఇండియా కూటమిలో (INDIA Bloc) దోబూచులాట జరుగుతోంది. విపక్ష పార్టీలన్నీ కూమిటిలో ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పొత్తులో ఉంటూనే ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే యూపీలో అఖిలేష్ యాదవ్ అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక తృణమూల్ కాంగ్రెస్‌ కూడా బెంగాల్‌లో కాంగ్రెస్‌తో (Congress) పొత్తు ఉండబోదని తెలిపింది. ఇకపోతే పంజాబ్, చండీగఢ్‌లో ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. తాజాగా ఢిల్లీ విషయంలో కూడా అదే జరుగుతుందని చెబుతూనే కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తామంటూ ఆప్ ప్రకటించింది.

 

ఢిల్లీ (Delhi)లో ఉన్న ఏడు లోక్‌‌సభ స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌కు ఇస్తామని ఆప్ తెలిపింది. ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదని.. కానీ పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తామని ఆప్ వెల్లడించింది. సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమిలో ఇప్పటికే వివాదాలు పెరుగుతున్న వేళ ఆప్‌ ప్రకటన వెలువడటం గమనార్హం. తాజాగా వచ్చిన ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఓ సభలో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌‌సభ సీట్లను ఆప్‌కు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే ఆప్‌ నుంచి ప్రతిపాదన వచ్చింది. వాస్తవానికి ఇరు పార్టీలు ఢిల్లీలో 4:3 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని చర్చలు జరుగుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఏర్పడ్డాయి.