Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..

Csk Stake Ms Dhoni

Csk Stake Ms Dhoni

2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు టైటిల్ గెలుచుకున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఒక ఆసక్తికర ఘటనను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బయటపెట్టారు. ఆ సీజన్‌లో సీఎస్కే జట్టుకు చెందిన ఒక ఆటగాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని నేరుగా అవమానిస్తూ, దుర్భాషలాడాడని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించారు. ఈ సంఘటనతో జట్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, సదరు ఆటగాడిని వెంటనే జట్టు నుంచి తొలగించి ఇంటికి పంపేయాలని ధోని చుట్టూ ఉన్నవారు ఒత్తిడి తెచ్చారు.

అయితే, తన వ్యక్తిగత ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినప్పటికీ ధోని ఆవేశపడకుండా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఆకాశ్ చోప్రా వివరించారు. ఆ ఆటగాడు మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని, తాను కెప్టెన్‌గా తన అహాన్ని (ఇగో) ప్రదర్శిస్తే అతడి బ్యాగులు సర్ది ఇంటికి పంపేయగలనని ధోని అన్నట్లు చోప్రా గుర్తుచేసుకున్నారు. కానీ ఆ ఆటగాడు జట్టుకు ఎంతో ఉపయోగపడతాడని, చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని భావించిన ధోని, తన కోపాన్ని , ఆత్మాభిమానాన్ని దిగమింగుకుని అతడిని జట్టులోనే కొనసాగించారని తెలిపారు. ధోని తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం ఫలించి, ఆ ఆటగాడు జట్టు విజయాల్లో భాగమవ్వడమే కాకుండా సీఎస్కే 2023 ఛాంపియన్‌గా నిలవడానికి తోడ్పడ్డాడు.

మరోవైపు.. ధోని తన ఐపీఎల్ ఆటగాడి ప్రయాణానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2025 మేలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ అతడికి చివరి మ్యాచ్ అయింది. 2026లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ధోనీ ఆడలేకపోయారు. సీఎస్కే తరఫున మొత్తం 278 మ్యాచ్‌లలో 5,439 పరుగులు సాధించారు. ధోని సారథ్యంలో చెన్నై జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే భారత జట్టుకు మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన ధోని, 2027 ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్కే జట్టుకు మెంటార్‌గా తన సేవలను అందించనున్నారు.