NTV Telugu Site icon

Aadi Srinivas : పార్టీ ఫిరాయింపుల పైన కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడు

Aadi Srinivas

Aadi Srinivas

పార్టీ ఫిరాయింపుల పైన కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని ని మంత్రి గా చేసినప్పుడు కేసీఆర్ ను ఎందుకు కేటీఆర్ నిలదీయలేదని, 2019 లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కేటీఆర్ చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలకు ఆకర్షితులై  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బంతి భోజనాలు చేస్తున్నాడని, పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వీడ్కోలు పార్టీ లు ఇస్తున్నాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే లకు ప్రగతి భవన్ గేట్లు ఎందుకు తెరుచుకోలేదు..? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ తో పేగు బంధం తెగిపోయిందని, రేవంత్ రెడ్డి తుఫాన్ లో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు ఆది శ్రీనివాస్‌. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ…ఆ నావలో ఎవరూ ఉండరని, అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే లను కేసీఆర్ హీనాతిహీనంగా చూశారన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇస్తున్నారని, బీఆర్ఎస్ మిగిలేది ఆ నలుగురు మాత్రమే..త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఉన్న గౌరవం తోనే మా సీఎం ఆయన ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు.

అనంతరం.. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. ఫామ్ హౌస్ లో విందు పేరుతో కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కపట ప్రేమ చూపిస్తున్నారని, ఇంత కాలం  ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. కేసీఆర్  విందు భోజనాల పేరిట ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నట్లుందని, పదేళ్లలో రాజ్యాంగం, అన్యాయం, అక్రమం అన్న మాటలు కేటీఆర్ కు గుర్తు రాలేదా అని ఆయన అన్నారు. ప్రగతి భవన్ కంచెలు తాకకుండా దుర్మార్గమైన పాలన చేశారని, మళ్లీ గడిలను కట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుందన్నారు మక్కాన్‌ సింగ్‌. బీజేపీతో కలిసి కేసీఆర్ అనేక కుట్రలు చేశారని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెప్పారన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తే రేవంత్ రెడ్డి తుఫాన్ లో కొట్టుకుపోతారని, గతంలో కేసీఆర్ ఎమ్మెల్యే లను ప్రలోభపెట్టి కొనుగోలు చేశారన్నారు. మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని, ప్రతిపక్షాలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం మా అంతర్గతం అని, జీవన్ రెడ్డి సీనియర్ నేత, గొప్ప నాయకుడు.. ఆయన పైన సీఎం రేవంత్ రెడ్డి కి అమిత గౌరవం ఉందన్నారు.