Marriage : పెళ్లంటే నూరేళ్లపంట అంటారు. ఈ మధ్యకాలంలో యువకులు జీవితంలో సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుందామనుకున్న ఆలోచనలో ఉన్నారు. సెటిల్ అయ్యే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వయసు ముదిరిన వాళ్లకు పిల్లను ఇచ్చేదేలే అని తల్లిదండ్రులు అంటుంటడంతో 40ఏళ్లు వచ్చిన కొందరికి పెళ్లిళ్లుకావడం లేదు. పెళ్లికి దీంతో వయసు అయిపోయి కొందరు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. ఇదే క్రమంలో ఓ యువకుడు ఏకంగా పెళ్లికి పిల్లను వెతికి పెట్టమంటూ మాజీ సీఎంకు అర్జీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇది కర్ణాటకలో జరిగింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి వద్దకు నిత్యం వందలాది మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఫిర్యాదులతో వస్తుంటారు. రకరకాల కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో ఓ యువకుడు ఈ మాజీ సీఎంకి ఓ విచిత్రమైన అర్జీ పెట్టుకున్నాడు. తాను పెళ్లి చేసుకోవడానికి వధువు దొరకడం లేదంటూ హెచ్‌డి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు.
Read Also: HIT 2: ఆ దర్శకుడే నా సెంటిమెంట్ : హీరో నాని
కోలారు జిల్లా పంచరత్న యాత్రలో కుమారస్వామి.. గ్రామస్తులు, రైతుల కష్టాలు వింటున్నారు. ఇంతలో ముదువతి గ్రామానికి చెందిన ధనంజయ అనే యువకుడు కుమార స్వామికి ఓ వినతిపత్రం ఇచ్చాడు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదంటూ అందులో ప్రస్తావించాడు. ‘ఒక్కలిగ’ రైతు యువకులకు పెళ్లి వయసు దాటినా అమ్మాయిలు దొరకడం లేదని, ఒక్కలిగ యువకులకు వధువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కుమారస్వామిని లేఖ ద్వారా అభ్యర్థించాడు. ‘కోలార్‌లో రైతు యువకులు వధువుల కొరతను ఎదుర్కొంటున్నారు. మీరు సీఎం అయిన వెంటనే మన జిల్లాకు చెందిన వధువులను ఇతర జిల్లాలకు చెందిన వరులను పెళ్లి చేసుకోకూడదనే నిబంధనను అమలు చేయాలి. నువ్వు మాకు వధువులను వెతకాలి’ అని ధనంజయుడు కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి సీఎం కావడం ఖాయమని, జేడీఎస్ ప్రభుత్వంలో ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ధనంజయ కోరాడు.