Tragedy: రాజధాని హైదరాబాదులో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక తాను ఈ అఘాయిత్యం చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తికి చెందిన రెడపాక పల్లవి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలోనే సదానంద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో సదానంద్ తో సహజీవనం చేస్తోంది. సదానంద్ కూడా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత పల్లవికి తెలియకుండా శిరీష అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలయ్యారు. రెండేళ్లుగా పల్లవితో కలిసి ఇందిరానగర్‌లో ఇల్లు తీసుకుని ఉంటున్న సదానంద్ ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేసేవాడు.
Read Also: Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..
అంతటితో ఆగకుండా తరచూ కొట్టేవాడు. పల్లవి చనిపోతే తాను ఊరెళ్లిపోయి తన భార్యాపిల్లలతో ఉంటానంటూ చెప్పేవాడు. ఈ నేపథ్యంలోనే పల్లవి ఈ నెల 22న రాత్రి తన తల్లి లక్ష్మికి ఫోన్ చేసి తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెప్పుకుంది. తనకు బతకాలని లేదంటూ ఏడుస్తూ తల్లికి బాధను తెలుపుకుంది. తాము ఊరినుంచి బయలు దేరి వస్తున్నామని, సదానంద్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తల్లి కూతురుకి ధైర్యం చెప్పింది. కానీ ఈలోగానే, గురువారం తెల్లవారుజామున పల్లవి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సదానంద్ వేధింపులతోనే పల్లవి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.