Site icon NTV Telugu

Medaram Jatara: వనం నుంచి జనంలోకి.. చిలకల గుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క..

Medaram

Medaram

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారు సమ్మక్క మేడారానికి బయల్దేరారు. డప్పు వాయిద్యాల, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని వస్తున్నారు. భక్తులు జయజయధ్వానాలు, పొర్లుదండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలుకుతున్నారు. సమ్మక్కను ఈ రాత్రి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని.. భక్త జనులకు దర్శనమిస్తున్నారు.

పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. మేడారం గద్దెపై కొలువుదీరనున్న ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించడానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది.

Exit mobile version