Gas leak : పంజాబ్‌లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. విషవాయువును పీల్చి మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఫ్యాక్టరీలో అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భటిండా నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే బయల్దేరారు. స్థానిక మీడియా వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, పంజాబ్‌లోని, లూథియానా, షేర్‌పూర్ చౌక్ సమీపంలో సువా రోడ్డులో గోయల్ మిల్క్ ప్లాంట్ ఉంది. ఇక్కడ డెయిరీ ఉత్పత్తులు తయారవుతాయి. ఆదివారం ఉదయం 7.15 గంటలకు కూలింగ్ సిస్టమ్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు.
Read Also: Pakistan : సంసార సుఖం కోసం బల్లి నుంచి ఆయిల్.. ఎగబడి కొంటున్న జనం
గ్యాస్ లీక్ కావడంతో ఫ్యాక్టరీలోని కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. ఈ ప్రమాదంపై లూథియానా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ స్వాతి తివానా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతోందని, పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులను, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ దగ్గరికి పంపించినట్లు వివరించారు. అయితే, అప్పటికే విషవాయువు పీల్చి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారని స్వాతి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ.. గ్యాస్ లీక్ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
Read Also: Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు
