Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగిత్యాలలో 82 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన చీటీ శ్యామల అనే వృద్ధురాలు తన బంధువులతో కలిసి జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ.. తన బంధువుల సాయంతో ఆమె జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని ఆమె నామినేషన్ వేయడానికి గల కారణాలను వివరించారు.
Also Read: MLC Kavitha: బీజేపీ బీసీ ముఖ్యమంత్రి హామీ హాస్యాస్పదం
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ తన భర్త చీటీ దామోదర్ రావు స్వాతంత్ర సమరయోధుడని తెలిపింది. అయితే తన పెద్ద కుమారుడు శ్రీరామ్ రావు ఆస్తి తగాదాల కారణంగా కోర్టు కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. ఈ కేసుల కారణంగా తాను అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులతో పాటు ప్రభుత్వానికి నాయకులకు తన సమస్య తెలుస్తుందని ఉద్దేశంతోనే నామినేషన్ వేసినట్లుగా శ్యామల వెల్లడించారు.