NTV Telugu Site icon

8 Sixes Off 8 Balls: క్రికెట్‌లో సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు!

8 Sixes Off 8 Balls

8 Sixes Off 8 Balls

క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్‌లదే హవా నడుస్తోంది. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు నమోదవగా.. తాజాగా ఓ బ్యాటర్ 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఘటన స్పెయిన్ టీ10 టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోంట్‌జుక్ ఒలింపిక్ గ్రౌండ్‌లో యునైటెడ్‌ సీసీ గిరోనా, పాక్ బార్సిలోనా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ ఎనిమిది బంతుల్లో ఎనిమిది సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్సిలోనా జట్టుకు మెరుపు ఆరంభం దక్కింది. అయితే 6.1 ఓవర్ల తర్వాత 113/4తో నిలిచింది. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అలీ హసన్ ఆదుకున్నాడు. ఏడో ఓవర్‌ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్‌లోని 2,3,4 బంతులకు సిక్సర్లు బాదాడు. దాంతో హసన్ ఎదుర్కొన్న వరుస 8 బంతుల్లో 8 సిక్స్‌లు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న హసన్‌.. 8 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Also Read: IPL Auction 2024: బాబాకి జయహో.. భవిష్యత్తు కోసం కాస్త జ్ఞానాన్ని ఉంచుకోండి! మాజీ క్రికెటర్‌కు షమీ కౌంటర్

అలీ హసన్ విధ్వంసంతో పాక్ బార్సిలోనా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యునైటెడ్ సీసీ గిరోనా 9.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లే రికార్డ్‌. యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, హర్షల్ గిబ్స్ ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు బాదారు. దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రితో పాటు మరికొందరు 6 సిక్స్‌లు బాదారు. అయితే 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదడం మాత్రం ఇదే తొలిసారి. ఏ క్రికెట్‌లో అయినా 8 సిక్స్‌లు బాదడం తొలిసారిగా నిలిచింది.