Couple Attacked: ముంబైలోని ఓ పబ్లిక్ పార్కులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పార్కులో ఫొటోలు దిగుతున్న ఓ జంటపై కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికి ఈ కేసులో ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. నవంబర్ 20, శుక్రవారం ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఫీనిక్స్ మాల్ సమీపంలోని ఓ గార్డెన్లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ జంట ఫొటోలు దిగుతుండగా.. దాదాపు ఓ 10 మంది బాలురు వారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ జంట అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిపై దాడికి దిగారు. కర్రలతో కొట్టడంతో పాటు, యువకుడిని తన్నుతూ, పిడిగుద్దులు కురిపించారు. అంతేకాదు మెట్ల మార్గంలో కొద్దిదూరం వరకు వెంటాడారు కూడా.
ఈ ఘటనను అక్కడున్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత జంట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి 8 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని డీసీపీ గణేష్ షిండే వెల్లడించారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య స్పందించారు. దాడికి గురైన జంట హిందువులని పేర్కొంటూ.. దాడికి పాల్పడిన వారిని ‘ముస్లిం మతోన్మాదులు’గా అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైందని, ఐదుగురు బాలుర తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. శివసేన (యూబీటీ) నేత ఇంటెఖాబ్ ఫరూఖీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే, దాడికి గల కారణాలు, నిందితులపై తదుపరి చర్యలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
A group of Muslim boys confronting and surrounding a single boy and girl, with physical pushing and arguments at a public garden behind Phoenix Mall in Chirag Nagar, Mumbai.😳 https://t.co/iXUUayzIO0
— subash kumar (@Krishan10_) November 20, 2026

