NTV Telugu Site icon

Rajasthan: ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. ఏడుగురు సజీవదహనం

Rajasthan

Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. కారు ప్రయాణికులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నివాసితులు కాగా.. రాజస్థాన్‌లోని సలాసర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయం నుంచి తిరిగి వస్తున్నారు. చురు వైపు వెళ్తున్న కారు డ్రైవర్ ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఎదురుగా మరో వాహనం రాగానే దాన్ని ఢీకొట్టకుండా చూసే క్రమంలో అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టాడు. ట్రక్కును ఢీకొనడంతో కారులోని గ్యాస్‌ కిట్‌లో మంటలు చెలరేగాయి. ట్రక్కులో లోడ్ చేసిన కాటన్ మంటలకు మరింత ఆజ్యం పోసింది. స్థానికులు వారిని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా మంటలు ఎక్కువ కావడంతో.. లాక్‌ చేసి ఉన్న డోర్లు తీయకపోవడంతో కారులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

Read Also: Salman Khan: సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం.. అమెరికాలో ప్లాన్‌, ముంబైలో అమలు!

ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన రామ్‌నివాస్ సైనీ మాట్లాడుతూ.. ప్రయాణికులు సహాయం కోసం అరుస్తున్నారని, అయితే మంటల కారణంగా తాను వారికి సహాయం చేయలేకపోయానని చెప్పారు. అగ్నిమాపక దళం వాహనాలను మోహరించింది. అయితే మంటలను అదుపులోకి తెచ్చే సమయానికి కుటుంబ సభ్యులు మరణించారు. మృతులు నీలం గోయల్ (55), ఆమె కుమారుడు అశుతోష్ గోయల్ (35), మంజు బిందాల్ (58), ఆమె కుమారుడు హార్దిక్ బిందాల్ (37), అతని భార్య స్వాతి బిందాల్ (32), వారి ఇద్దరు మైనర్ కుమార్తెలుగా గుర్తించారు. ఇంతలో లారీ డ్రైవర్, హెల్పర్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు యజమాని అశుతోష్ ఏడాదిన్నర క్రితం కారును విక్రయించాడు. పోలీసులు కారు విక్రయించిన ఏజెంట్‌ను సంప్రదించి, అతని ద్వారా కుటుంబాన్ని గుర్తించగలిగారు.