NTV Telugu Site icon

6G Technology: ఇక.. 6G దిశగా.. రెడీ అవుతున్న ఇండియా. 100 పేటెంట్లు భారతీయుల సొంతం

6G Technology

6G Technology

6G Technology: ప్రపంచంలో అంతం అంటూ లేనివాటిలో టెక్నాలజీ కూడా ఒకటి. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు తెర మీదికొస్తున్నాయి. తద్వారా.. మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాలోకి 5జీ టెక్నాలజీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంకేతికత.. భారతదేశంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ అంచనాలను మించిపోయింది.

Marry Now Pay Later: పెళ్లికి డబ్బు కావాలా? Marry Now-Pay Later అంటున్న సంస్థ

ఈ నెలాఖరు నాటికి 200 సిటీలకు 5జీ టెక్నాలజీ విస్తరిస్తుందని కేంద్రం ఆశించగా.. రెట్టింపు సంఖ్యలో.. 397 నగరాల్లోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌లతో రాకెట్‌ స్పీడుతో ముందుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్లు ఇక 6G టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. ఈ మేరకు సైంటిస్టులు, ఇంజనీర్లు, అకాడమీషియన్లు ఇప్పటికే 100 పేటెంట్లను సొంతం చేసుకోవటం విశేషం.

ఈ పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇండియా వరల్డ్‌లోనే అతిపెద్ద ఎకానమీగా ఎదగనుందని పేర్కొంది. పరిపాలన, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం తదితర రంగాల్లో పరివర్తన ద్వారా ఇది సాధ్యపడుతుందని తెలిపింది. ఈ విషయమై.. కేంద్ర ఐటీ మరియు టెలికం శాఖల మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. మన దేశం ఇప్పటికే మూడున్నర ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరిందని అన్నారు.

ఈ విలువను రూపాయల్లో చెప్పాలంటే.. 2 కోట్ల, 89 లక్షల, 20 వేల, 500 కోట్లు అని అర్థం. భారతదేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే.. వేల సంఖ్యలో ఉన్న వ్యవస్థల్లో మార్పు రావాలని చెప్పారు. పరిపాలన, బ్యాంకింగ్‌, లాజిస్టిక్స్‌, బిజినెస్‌ వంటి రంగాల్లో మార్పులు వస్తే.. ఇండియాని ఏ శక్తీ ఆపజాలదని, 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ రేంజ్‌కి చేరుకొని తీరుతుందని ధీమా వెలిబుచ్చారు.

పదేళ్ల కిందట మన దేశం 99 శాతం మొబైల్‌ ఫోన్లను దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు 99 శాతం మొబైల్‌ ఫోన్లను స్థానికంగానే తయారుచేసుకోగలుగుతోందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రతిభకు కొదవలేదని, అయితే.. ఆ ట్యాలెంట్‌ పీపుల్‌ని సరైన మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన భారత్‌ స్టార్టప్‌ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ఈ మేరకు ప్రసంగించారు.