Bus Accident: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. 63 మంది భక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కూకుటిమానగడ్డ సమీపంలో కారును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలు కాగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఏడుగురిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: Hayathnagar Crime: హయత్‌నగర్ పాప మృతి కేసులో ట్విస్ట్..
విషయం తెలుసుకున్న మదనపల్లె ఆర్డీవో మురళీ, డీఎస్పీ శేషప్ప, పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వద్దకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా రావడం, బ్రేక్ వేసినా బస్సు అదుపు కాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
