Australian bowler Gareth Morgan takes 6 wickets in 6 balls: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేస్తే.. బౌలర్లు హ్యాట్రిక్ తీస్తుంటారు. ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు నమోదయినా.. 6 బంతుల్లో 6 వికెట్లు ఎవరూ తీయలేదు. తాజాగా ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్.. 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్‌కోస్ట్ ప్రిమియర్ లీగ్ డివిజన్-3 టోర్నీలో నెరాంగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్.. సర్ఫర్స్ పారడైజ్ సీసీపై ఈ అరుదైన ఘనత సాధించాడు.
40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్స్ కోల్పోయి 174 రన్స్ చేసింది. 6 బంతుల్లో 5 పరుగులు చేస్తే సర్ఫర్స్ విజయం సాధిస్తుంది. ఇక సర్ఫర్స్ విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఈ తరుణంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా.. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. గారెత్ దెబ్బతో సర్ఫర్స్ జట్టు ఆలౌట్ అయింది. దాంతో ముద్గీరాబా నెరంగ్ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది.
Also Read: Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
గారెత్ మోర్గాన్ వేసిన 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్ ఔట్స్ కాగా.. మిగతా రెండు బౌల్డ్ ఔట్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గారెత్ 7 ఓవర్లు వేసి 7 వికెట్స్ పడగొట్టి 16 రన్స్ ఇచ్చాడు. అంతకుముందు సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్‌ని గారెత్ ఔట్ చేశాడు. గారెత్ బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 39 పరుగులతో టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఓటమి అంచుల వరకూ వెళ్లిన ముద్గీరాబా నెరంగ్ జట్టును గారెత్ ఊహించని విధంగా గెలిపించాడు.
ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదివరకు ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఉన్నా.. 6 వికెట్స్ ఎవరూ తీయలేదు. 2011లో వెల్లింగ్టన్‌పై ఒటాగో తరఫున న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్, 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ-బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టారు. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్ హరియాణాపై 5 వికెట్స్ తీశాడు. వీరిని గారెత్ మోర్గాన్ అధిగమించాడు.
