తెలుగునాట జానపద చిత్రాలు అనగానే ముందుగా స్ఫురించే పేరు నటరత్న యన్.టి.రామారావుదే! ఆ తరువాతే ఎవరి పేరైనా గుర్తుకు వస్తుంది. యన్టీఆర్ తరువాత ఎక్కువ జానపద చిత్రాలలో హీరోగా నటించిన ఘనత కాంతారావుదే! వారిద్దరూ కలసి అనేక జానపద చిత్రాలలో నటించారు. ఇక కాంతారావు సైతం జానపద కథానాయకునిగా ఊపుమీదున్న రోజుల్లో ఆయన యన్టీఆర్ తో కలసి సమానస్థాయిలో నటించిన జానపదం ‘చిక్కడు-దొరకడు’ అనే చెప్పాలి. శ్రీలక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి సీతారామస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1967 డిసెంబర్ 21న ‘చిక్కడు-దొరకడు’ విడుదలై గ్రాండ్ కమర్షియల్ సక్సెస్ చూసింది.
‘చిక్కడు-దొరకడు’ కథలోకి తొంగి చూస్తే – మాళవ, పుష్పపురి, పాంచాలపురం రాజులు తమ సంపదను దుష్టుల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఓ ఉపాయం ఆలోచిస్తారు. ముగ్గురి సంపదను ఓ రహస్య ప్రదేశంలో ఉంచి, ఆ నిధికి సంబంధించిన దారిని తెలిపే మార్గాలను మూడు హారాలలో నిక్షిప్తం చేస్తారు. ఒక్కొక్కరిది దగ్గర ఒక్కో హారం పెట్టుకుంటారు. ఆ మూడు హారాలు వినాయక, ఆంజనేయ, గరుత్మంత విగ్రహాలకు వేస్తేనే నిధికి అసలు మార్గం కనిపిస్తుంది. ఇలా పథకం రూపొందించుకుంటారు. మాళవ రాజు ధర్మపాలునికి సంతానం ఉండరు. దాంతో ఆయన బావమరిది కొడుకు ప్రచండ సేనను దత్తత తీసుకోవాలని భావిస్తూంటాడు. ఈ లోగా మహారాణి గర్భవతియై ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిస్తుంది. తన కొడుకుకు సింహాసనం దక్కదని భావించిన రాజు బావమరిది, రాణి ఓ తాబేలును, గుండ్రాయిని ప్రసవించిందని ప్రచారం చేసి, పిల్లలను చంపమని పంపుతాడు. ఆ పిల్లలిద్దరూ ఒక్కొక్కరు ఒక్కోచోట పెరుగుతారు. పెద్దవాడు చిక్కడు పేరుతో ఓ దొంగల ముఠానాయకుని వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. ఓ పల్లెపడచు చిన్నవాడిని దిలీపుడు పేరుతో పెంచి పెద్ద చేస్తుంది. దిలీపుడు ఇరుగు పొరుగు రాజ్యాలకు తన అడవి చెట్టుపుట్టల నుండి అరుదైన కానుకలు పంపిస్తూ వారిచ్చిన కానుకలతో ధర్మసత్రాలు కట్టిస్తాడు. చిక్కడు ఉన్నవారిని దోచుకొని లేనివారికి పంచుతూ ఉంటాడు.
దిలీపుడు పాంచాలపురం రాకుమారి పద్మావతిని కలుసుకుంటాడు. వారిద్దరూ ప్రేమలో పడతారు. చిక్కడు చేతివాటం ఓ సవాల్ గా తీసుకున్న పుష్పపురి రాణి ప్రియంవద అతడిని పట్టుకోవాలను కుంటుంది. చివరకు అతని ప్రేమలో పడుతుంది. మాళవ రాజ్యంలో పెత్తనం చెలాయిస్తున్న ప్రచండసేనునికి ఈ మూడు హారాల గురించి తెలుస్తుంది. అతను పాంచాలపురం రాజుపై హారం కోసం ఒత్తిడి తెస్తాడు. ఈ విషయం తెలుసుకున్న దిలీపుడు మిగిలిన రెండు హారాల కోసం బయలు దేరతాడు. అక్కడ చిక్కడు అనే దొంగ కూడా ఉన్నాడని తెలుసుకొని, తాను ‘దొరకడు’ అన్న పేరుతో హారాల కోసం వేట ప్రారంభిస్తాడు. చిక్కడు, ప్రియంవద సైతం హారాల కోసమే వెదుకుతుంటారు. అలా చిక్కడు- ప్రియంవద ఓ వైపు, మరో వైపు దొరకడు – పద్మావతి కలసి చివరకు మూడు హారాలు సంపాదిస్తారు. తరువాత కొన్ని గుర్తుల వల్ల చిక్కడు-దొరకడు అన్నదమ్ములు అన్న విషయం తెలుస్తుంది. నిధికి మార్గం ఏర్పరచుకుంటారు. ఈ లోగా ప్రచండుడు తన బలగంతో వచ్చి వారిపై దాడికి దిగుతాడు. చివరకు చిక్కడు చేతిలో అతను హతమవుతాడు. కథ మొత్తం మూడు హారాల చుట్టూ తిరుగుతూ చిక్కడు-దొరకడు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ వినోదం పంచుతారు. ఎవరి ప్రియురాళ్ళను వాళ్ళు పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
యన్టీఆర్ కు జోడీగా జయలలిత, కాంతారావుకు జంటగా కృష్ణకుమారి నటించిన ఈ చిత్రంలో మిక్కిలినేని, సత్యనారాయణ, త్యాగరాజు, బాలకృష్ణ (అంజి), మోదుకూరి సత్యం, కేవీ చలం, జగ్గారావు, విజయలలిత, ఛాయాదేవి, మీనాకుమారి, రాజేశ్వరి తదితరులు నటించారు. ఈ చిత్రానికి వీటూరి రచన చేయగా, సి.నారాయణ రెడ్డి, వీటూరి పాటలు రాశారు. టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. ఇందులోని “పగటిపూట చంద్రబింబిం…”, “దోరనిమ్మపండులాగా…”, “ఇదిగో నేనున్నాను…”, “ఓరబ్బి వినరయ్యో…”, “కన్నెపిల్ల అనగానే…”, “ఇంతలో ఏమో…”, “అందాలన్నీ నీవే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ముఖ్యంగా ‘దోరనిమ్మ పండులాగ ఊరించే దొరసాని…’ పాటలో యన్టీఆర్, జయలలితను కుడిభుజం మీద ఎత్తుకొని నర్తించడం ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
యన్టీఆర్ తో జయలలిత నటించడం 1967లోనే మొదలయింది. వారిద్దరూ నటించిన తొలి చిత్రం ‘గోపాలుడు-భూపాలుడు’ జనవరిలో విడుదల కాగా, రెండో సినిమాగా వచ్చిన ‘చిక్కడు-దొరకడు’ ఆ యేడాది యన్టీఆర్ చివరి చిత్రంగా వచ్చింది. జానపద కథానాయకునిగా కాంతారావు సినిమాలు సైతం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఆ సమయంలో ఈ సినిమా కంటే ముందు ఏయన్నార్ తో కలసి కాంతారావు ‘రహస్యం’ అనే రంగుల చిత్రంలో నటించారు. ‘చిక్కడు-దొరకడు’ కంటే 11 రోజులు ముందు విడుదలయన ‘రహస్యం’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కాగా, బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ‘చిక్కడు-దొరకడు’ భలేగా అలరించింది. ఇదే కథను ఎల్.వి.ప్రసాద్ హిందీలో ‘జయ్-విజయ్’ పేరుతో జితేంద్ర, రీనారాయ్ తో 1977లో రీమేక్ చేశారు.