NTV Telugu Site icon

IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై ఇండియన్స్‌కు భారీ ప్రయోజనం!

Ipl 2025 Retention

Ipl 2025 Retention

Rohit Shama is in the Mumbai Indians for IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో మెగా వేలం వచ్చిన ప్రతిసారీ అన్ని జట్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. మెగా వేలం సమయంలో నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఐపీఎల్‌ జట్లకు ఉంటుంది. దాంతో ప్రాంఛైజీలు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో జట్టు స్వరూపం పూర్తిగా మారిపోతుంటుంది. అయితే ఈసారి ఒకరిని అదనంగా అట్టిపెట్టుకునే అవకాశాన్ని ప్రాంఛైజీలకు బీసీసీఐ కల్పించబోతోందని తెలుస్తోంది.

అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను అయిదుకు పెంచాలని ఫ్రాంఛైజీలు ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాంఛైజీలు, బీసీసీఐ మధ్య జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. కొన్ని కారణాల వల్ల ప్రాంచైజీల డిమాండ్‌ను బీసీసీఐ అంగీకరించలేదు. అయితే చివరకు ప్రాంచైజీల డిమాండ్‌కు బీసీసీఐ ఓకే అన్నట్లు సమాచారం. ప్రతీ ప్రాంచైజీకి ఐదుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డ్ ఈసారి లేదని సమాచారం. ఐపీఎల్‌ 2025లో ఐదుగురు ఆటగాళ్లను ప్రతీ టీమ్ అట్టిపెట్టుకోవచ్చు. ఇది ముంబై ఇండియన్స్‌ లాంటి జట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: IND vs BAN: అభిమానులు ఎగిరి గంతేస్తే.. కాన్పూర్‌ స్టేడియం పరిస్థితి ఏంటి?

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మాజీ సారథి రోహిత్‌ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌లను ముంబై ఇండియన్స్‌ అట్టిపెట్టుకునే అవకాశముంది. ఇక తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌లలో ఒకరిని ఆర్‌టీఎమ్ ద్వారా తీసుకుంటుంది. రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన నేపథ్యంలో హిట్‌మ్యాన్ వేలంలోకి వెళ్తాడనే ప్రచారం జరిగింది. ముంబై కూడా రోహిత్‌ను వదులుకుంటుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ముంబై యాజమాన్యం, రోహిత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్న కారణంగా.. హిట్‌మ్యాన్ జట్టుతో కొనసాగేందుకు సుముఖంగా ఉన్నాడని తెలుస్తోంది. రోహిత్‌తో ముంబై యాజమాన్యం సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే.