Ghantasala Venkateswararao: మరపురాని మధురగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి డిసెంబర్ 4న సంపూర్ణమవుతుంది. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని ఘంటసాల అభిమానులు ఆ అమరగాయకునికి జేజేలు పలుకుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఘంటసాల గాయకునిగానే కాదు, సంగీత దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన అనేక చిత్రాలు ఆయన స్వరకల్పనలోనూ, గళవిన్యాసలతోనూ రూపొందాయి. ఈ నాటికీ ఆయన పంచిన మధురాన్ని తెలుగువారు మననం చేసుకుంటూనే ఉన్నారు. నవతరం సైతం ఘంటసాల మాధుర్యాన్ని తలచుకొని పరవశించి పోతోంది.
ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న కృష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించారు. తన తండ్రి రాసి, గానం చేసిన తరంగాలకు బాల ఘంటసాల నాట్యం చేస్తూండేవారు. పట్రాయని సీతారామశాస్త్రి వద్ద సంగీతం అభ్యసించిన ఘంటసాల, తరువాత విజయనగరంలోని మహారాజావారి సంగీత కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు ఘంటసాల. ఆల్ ఇండియా రేడియోలో గాయకునిగా తనదైన బాణీ పలికించారు ఘంటసాల. తరువాత సముద్రాల సీనియర్ ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అక్కడ మహానటుడు, సంగీత విద్వాంసులు అయిన చిత్తూరు వి.నాగయ్య వద్ద శిష్యరికం చేశారు. సి.ఆర్.సుబ్బురామన్, గాలి పెంచల వంటి వారి వద్ద అసోసియేట్ గానూ పనిచేసిన ఘంటసాల ‘మనదేశం’ చిత్రంతో సోలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అయితే ఆయన స్వరకల్పనలో రూపొందిన ‘కీలుగుర్రం’ ముందుగా విడుదలయింది. ఆపై ఘంటసాల సంగీత జైత్రయాత్ర సాగింది.
తెలుగు సినిమా రంగానికి రెండుకళ్ళుగా భావించే యన్టీఆర్, ఏయన్నార్ నటులుగా నిలదొక్కుకొని, స్టార్స్ గా ఎదిగిన క్రమంలో ఘంటసాల గళమే జీవం పోసిందని చెప్పవచ్చు. ఘంటసాల గాత్రమే కాదు, సంగీతంతోనూ పరవశింప చేసిన “పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, కన్యాశుల్కం, జయం మనదే, మాయాబజార్, గుండమ్మకథ, లవకుశ, పాండవ వనవాసము, పరమానందయ్య శిష్యుల కథ” వంటి సూపర్ డూపర్ హిట్స్ తెలుగు వారి మదిలో పాటలతోనే పందిళ్ళు వేశాయి. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, తులు, హిందీ భాషల్లోనూ ఘంటసాల స్వరకల్పన చేసి అలరించారు. ఇక ఆయన గాత్రంలో జాలువారిని అనేక మధుర గీతాలు ఈ నాటికీ మురిపిస్తూనే ఉన్నాయి. ఘంటసాల సినిమా గీతాలే కాకుండా, ఆయన ఆలపించిన పలు ప్రైవేట్ రికార్డ్స్ సైతం ఆ రోజుల్లో అభిమానులను పులకింప చేశాయి. ముఖ్యంగా ఘంటసాల గానం చేసిన ‘భగవద్గీత’ దేశవిదేశాల్లోని తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల స్వర్గస్థులయ్యారు. ఆ దివి నుండి ఈ భువికి దిగి వచ్చిన గానగంధర్వునిగా ఘంటసాల జేజేలు అందుకున్నారు. ఆయన పాటలతో ఆ రోజుల్లో ఎంతోమంది గాయకులుగా తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పటికీ వర్ధమాన గాయకులు ఘంటసాల పాటలనే పాడుతూ సాగుతున్నారు. ఇలా తరతరాలను అలరిస్తూన్న ఘంటసాల శతజయంతి సంపూర్ణమయినా, ఆయన గాన మాధుర్యాన్ని మననం చేసుకుంటూ తెలుగువారు సదా ఘంటసాల మాస్టారు ప్రతిభను జగతికి చాటుతూనే ఉంటారని చెప్పవచ్చు.