NTV Telugu Site icon

‘పక్కింటి అమ్మాయి’కి 40 ఏళ్లు

చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఒకే కథ అటూ ఇటూ తిరిగి, మళ్ళీ మనముందు వాలుతూ ఉంటుంది. ప్రేక్షకులు సైతం తెలిసిన కథనే చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’ చిత్రం ఆ రోజుల్లో మంచి వినోదం పంచి విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత అదే కథ ‘పక్కింటి అమ్మాయి’గా పునర్నిర్మితమై అలరించింది. అసలు ఈ కథ బెంగాల్ నుండి దిగుమతి చేసుకున్నది. బెంగాలీ రచయిత అరుణ్ చౌదరి రాసిన ‘పషేర్ బరి’ ఆధారంగా అదే పేరుతో 1952లో ఓ బెంగాలీ చిత్రం తెరకెక్కి ఆకట్టుకుంది. దానిని సి.పుల్లయ్య తెలుగువారి ముందు ‘పక్కయింటి అమ్మాయి’గా నిలిపారు. 1960లో ఇదే కథ తమిళంలో ‘అడుత వీట్టు పెణ్’గా రూపొందింది. ఈ తమిళ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వేదాంతం రాఘవయ్య రీమేక్ చేయగా, అందులోనూ అంజలీదేవి నాయికగా నటించారు. 1968లో ఈ కథ హిందీలో ‘పడోసన్’గా రూపొంది మంచి విజయం సాధించింది. అదే మళ్ళీ తెలుగువారి ముందు 1981లో ‘పక్కింటి అమ్మాయి’గా నిలచింది. ఈ కథతోనే 2004లో ‘పక్కదమనె హుడుగి’ అనే కన్నడ చిత్రం రూపొందింది. ఇలా ‘పక్కింటి అమ్మాయి’ పలు భాషల్లో సందడి చేసింది. జయసుధ, చంద్రమోహన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘పక్కింటి అమ్మాయి’ 1981 నవంబర్ 27న జనం ముందు నిలిచింది.

Read Also: రాజమౌళి ‘RRR’ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

కథ విషయానికి వస్తే – ఇందూ అనే అందాల ముద్దుగుమ్మ ఇంటి చెంతనే బుచ్చిబాబు నివసిస్తూ ఉంటాడు. అందమైన ఇందూని చూసిన బుచ్చిబాబు మనసు సహజంగానే పారేసుకుంటాడు. ఇందూకేమో సంగీతం అన్నా, పాటలు అన్నా ప్రాణం. ఆమె ప్రేమను పొందేందుకు తనకు బోలెడు సంగీత పరిజ్ఞానం ఉందని కోతలు కోస్తాడు బుచ్చిబాబు. అతనికి సంగీతం రాదన్న అసలు విషయం తెలిసిన ఇందూ మొహం తిప్పుకుంటుంది. అంతటితో ఆగకుండా తాను శివ నటరాజ భాగవతార్ వద్ద సంగీతాభ్యాసం చేయడం మొదలెడుతుంది. ఆ భాగవతార్ కూడా ఇందూపై మనసు పారేసుకుంటాడు. తానూ సంగీతంలో సాధన చేసినట్టు ఫోజు కొడుతూ, భాగవతార్ తోనే పోటీ పడతాడు బుచ్చిబాబు. అందుకు అతనికి బాలరాజు అనే మిత్రుడు సాయం చేస్తాడు. అతని పాటకు, బుచ్చిబాబు పెదాలు కలిపి మొత్తానికి గట్టెక్కుతాడు. అయినా ఇందూ అతని ముఖం చూడటానికి ఇష్టపడదు. ఆమెకు, భాగవతార్ తో పెళ్ళి అని తెలుసుకున్న బుచ్చిబాబు ఆత్మహత్యకు పాల్పడతాడు. చివరకు ఇందూ అతని ప్రేమను అంగీకరించడంతో కథ సుఖాంతం అవుతుంది.

‘పక్కింటి అమ్మాయి’లో ఇందుగా జయసుధ, బుచ్చిబాబుగా చంద్రమోహన్, బాలరాజుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భాగవతార్ గా చక్రవర్తి నటించారు. మాడా, హేమసుందర్, ప్రభాకర్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రధారులు. చక్రవర్తి స్వరకల్పనకు వేటూరి, ఆరుద్ర, గోపి పాటలు పలికించారు. “రాగం… రాగం…”, “చిలకా పలకవే..”, “ఇందూ నా కళ్ళకు విందు…”, “ఇది సంగీత సంగ్రామమే…”, “పక్కింటి అమ్మాయి… పరువాల పాపాయి…” పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని నాగార్జున ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు సమర్పణలో ఎ.సారథి నిర్మించారు. కె.వాసు దర్శకత్వం వహించారు. అప్పట్లో యువతను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

‘పక్కింటి అమ్మాయి’ కథలో హీరో మిత్రుడు బాలరాజుగా మధురగాయకుడు బాలు నటించారు. ఈ పాత్ర అన్ని భాషల్లోనూ ముఖ్యమైనది. తొలుత 1952లో రూపొందిన ‘పషేర్ బరి’లో అనూప్ ఆ పాత్రలో కనిపించగా, 1953లో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’లో ఆ పాత్ర పేరు రాజా, దానిని ప్రముఖ గాయకులు ఎ.ఎమ్.రాజా పోషించారు. తమిళంలో ఈ పాత్రను కె.ఏ. తంగవేలు ధరించారు. హిందీ ‘పడోసన్’ లో ఈ పాత్ర పేరు విద్యాపతి, ఆ పాత్రలో ప్రముఖ గాయకులు కిశోర్ కుమార్ అభినయించారు. అలాగే హిందీలో సునీల్ దత్, సైరా బాను నాయకానాయికలుగా నటించారు. అందులో సంగీతం మాస్టర్ గా మెహమూద్ కనిపించారు. తెలుగులో ఈ పాత్రలోనే చక్రవర్తి దర్శనమిచ్చారు. అలా ప్రముఖులు కూడా తెరపై కనిపించడానికి కారణమయింది ‘పక్కింటి అమ్మాయి’ కథ.