NTV Telugu Site icon

Earthquake: సిక్కింలో తెల్లవారుజామున భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Earthquake

Earthquake

Earthquake: సిక్కింలోని యుక్సోమ్‌కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు తెల్లవారుజామున 4.15కి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. అయితే ఇది చాలా చిన్న భూకంపం కిందే లెక్క. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 దాకా ఉన్న భూకంపాలను చిన్నవిగా లెక్కిస్తారు. వీటి వల్ల గోడలు బీటలు వారడం వంటివి జరుగుతాయే తప్ప పెద్దగా నష్టం ఏదీ ఉండదు. కాకపోతే.. గత వారం టర్కీలో 3 భారీ భూకంపాలు రావడం వల్ల.. ఇలాంటి సమయంలో ఈ భూకంపం రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భూ ప్రకంపనలతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం అసోంలోనూ భూమి కంపించింది.

Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. ఇప్పటికే 34 వేలు దాటిన మృతుల సంఖ్య

ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల వేలాదిమంది మరణించిన నేపథ్యంలో భారతదేశంలోని సిక్కిం, అసోంలలో భూప్రకంపనలు సంభవించినపుడు జనం తీవ్ర భయాందోళనలు చెందారు. అసోంలో సంభవించిన భూకంపం ఘటన జరిగిన మరునాడే సిక్కింను భూప్రకంపనలు వణికించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర కలవరపడ్డారు. భూమి కంపించినపుడల్లా ప్రజలు టర్కీ, సిరియా భూకంప విపత్తును గుర్తు చేసుకొని వణుకుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మణిపూర్‌లోని ఉఖ్‌రుల్‌లో కూడా రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది. అంటే.. ఈశాన్య రాష్ట్రాల భూమిలోపల ఫలకాలు కదులుతున్నాయన్నమాట. అవి భారీగా కదిలితే మాత్రం ఈశాన్యంలో భారీ భూకంపం రాగలదు.