ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓవర్‌లోడ్‌తో కూడిన బస్సు లోతైన లోయలో పడడంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఢిల్లీలో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి బయలుదేరారు. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు మెజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై పౌరీ, రాంనగర్‌లోని ఏఆర్‌టీఓలను వెంటనే సస్పెండ్ చేశారు.
గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుంచి కుమావోన్‌లోని రామ్‌నగర్‌కు బస్సు వెళుతున్నట్లు సమాచారం. గర్వాల్ మోటార్ ఓనర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బస్సు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. రామ్‌నగర్‌కు కేవలం 35 కిలోమీటర్ల దగ్గర్లో అల్మోరాలోని మార్చులా ప్రాంతంలో 650 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటన ఎందుకు, ఎలా జరిగింది అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రాథమిక కారణం ఓవర్‌లోడింగ్ అని అంటున్నారు. బస్సులో 43 మంది ప్రయాణీకులకు సీట్లు ఉండగా.. అందులో 55 మంది ఉన్నారు. ఇరుకైన మలుపు దగ్గర డ్రైవర్ బస్సును అదుపు చేయలేక కాలువలో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: AP Deputy CM: నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..
ఘటనాస్థలంలోని దృశ్యాలు చూస్తే ప్రమాద తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. ఘటనా స్థలంలో కొంతమంది చనిపోగా.. మరికొంత మందిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. గాయపడిన వారిని రాంనగర్ ఉపజిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని విమానంలో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. గాయపడిన ఒకరిని హల్ద్వానీలోని STH ఆసుపత్రిలో చేర్చారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించాయి
అల్మోర ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.