NTV Telugu Site icon

Nanded Hospital: నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఏడుగురు మృతి.. 48 గంటల వ్యవధిలో 31 మంది మృతి!

Nanded Hospital

Nanded Hospital

Newborns and Patients Die at Maharashtra’s Nanded Hospital: మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు, చిన్నారులు సహా 24 మంది రోగులు చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఏడుగురులో నలుగురు చిన్నారులు ఉన్నారు. గడచిన 48 గంటల వ్యవధిలో నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. అయితే ఆసుపత్రిలో ఎలాంటి తప్పు జరగలేదని పీడియాట్రిక్స్ విభాగం డాక్టర్ కిషోర్ రాథోడ్ అంటున్నారు.

నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి మరణాలపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఈ అంశంపై మరింత సమాచారం కోరామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ మరణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఈరోజు మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

Also Read: Hyderabad Man Kills in London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!

నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ మాట్లాడుతూ… ‘ఇది తృతీయ స్థాయి ఆసుపత్రి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చికిత్స నిమిత్తం వస్తుంటారు. 70-80 కిమీల పరిసరాల్లో ఇలాంటి ఆసుపత్రి అందుబాటులో లేనందున అత్యవసర మరియు అత్యంత క్లిష్టమైన కేసులు వస్తుంటాయి. దూరం కారణంగా కొందరికి వైద్యం అందడంలో జాప్యం అయి చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోయి చనిపోతున్నారు. సిబ్బంది బదిలీల కారణంగా కొంత ఇబ్బంది ఉంది. మేము హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మందులు కొనుగోలు చేయవలసి ఉంది. కానీ అది కూడా జరగలేదు’ అని అన్నారు.

 

Show comments