300 Stones in Taiwanese woman Kidney after Takes Bubble Tea: మంచి నీరు తాగడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటికి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలనుకోవడం కూడా చాలా ప్రమాదం. నీటికి బదులుగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. తైవాన్‌లో 20 ఏళ్ల మహిళ కిడ్నీలో 300 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 300 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.
జియావో యు అనే మహిళకు మంచి నీరు తాగడమంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. దాంతో ఆమె నీటికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ తీసుకుంది. జియావో కొన్నేళ్లుగా నీళ్లకు బదులు స్వీట్ డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. మంచి నీరు తీసుకోక పోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతుంది. తాజాగా జ్వరం మరియు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
చి మెయి హాస్పిటల్‌లోని వైద్యులు జియావోకు టెస్టులు చేసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వైద్యులు ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 5 మిమీ నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండే రాళ్లను స్కాన్‌లో గుర్తించారు. మరోవైపు రక్త పరీక్షలో జియావో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ చేసి ఆమె కిడ్నీలోని రాళ్లను బయటకు తీశారు. రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను వెలికితీశారు. శస్త్రచికిత్స తర్వాత జియావో పరిస్థితి మెరుగుపడింది. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.
జియావోకు సర్జరీ చేసిన డాక్టర్ లిమ్ చై-యాంగ్ మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని చెప్పాడు. నీటికి బదులుగా
స్వీట్ డ్రింక్స్ తాగడం ఆమె మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీసిందన్నారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్‌లో చక్కెర, యాడెటివ్స్ ఉన్నాయని.. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి.. స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని ఆయన చెప్పారు.