NTV Telugu Site icon

Allari Priyudu Movie: రాజశేఖర్ ఇమేజ్‌ను మార్చేసిన ‘అల్లరి ప్రియుడు’!

Allari Priyudu

Allari Priyudu

Allari Priyudu Movie: స్ఫూర్తితోనే కీర్తి లభిస్తుందని ప్రతీతి. ఎవరైనా తమ కళలతో రాణించాలంటే అంతకు ముందు ఉన్నవారి కళల నుండి స్ఫూర్తి గ్రహించాల్సిందే అని పూర్వికులే సెలవిచ్చారు. దానిని ఆధారం చేసుకొనే మన కళాకారులు, రచయితలు సాగుతున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘సాజన్’ ను చూసి, ప్రభావితమై తెలుగులో కాసిన్ని మార్పులు చేసి, మన వాతావరణానికి అనువుగా రూపొందిన చిత్రం ‘అల్లరి ప్రియుడు’. ‘సాజన్’లో ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్ నడుమ కథ సాగితే, ఇద్దరు భామల నడుమ ఓ నాయకుణ్ణి ఇరికించి ‘అల్లరి ప్రియుడు’ను నడిపించారు. 1993 మార్చి 19న విడుదలైన ‘అల్లరి ప్రియుడు’తో అప్పటి దాకా యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ లో సాగిన రాజశేఖర్ రొమాంటిక్ హీరోగానూ మారిపోయారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన అన్న కె.కృష్ణమోహనరావు తమ ఆర్.కె.ఫిలిమ్ అసోసియేట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ, మధుబాల నాయికలుగా నటించారు.

Read Also: Bholaa Shankar: అఫీషియల్.. మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరోకి బంపరాఫర్

‘అల్లరి ప్రియుడు’ కథ ఏమిటయ్యా అంటే – తన కూతురు కవితారాణిని రక్షించబోయి, తన దగ్గర పనిచేసే కార్మికుడు మరణించడంతో ఓ యజమాని, అతని కూతురు లలితారాణిని కూడా సొంత కూతురుగా పెంచుతాడు. కవిత, లలిత ఇద్దరూ ఏ అరమరికలు లేకుండా పెరుగుతారు. తల్లీ,తండ్రి లేని లలిత ఎప్పుడూ అన్నిటా గెలవాలని కవిత కోరుకుంటూ ఉంటుంది. అందుకు కొన్నిసార్లు త్యాగం కూడా చేస్తూంది. దాంతో కవిత పేరుతో లలిత కవితలు రాస్తూ ఉంటుంది. అనుకోకుండా పొట్టకూటికై పాట్లు పడుతున్న రాజా, అతని బృందంతో లలితకు గొడవ జరుగుతుంది. అప్పటి నుంచీ రాజా, లలిత ఎదురుపడితే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. కవితారాణి పేరుతో లలిత రాసే కవితను ఓ సారి రాజా గానం చేస్తాడు. ఆ తరువాత రాజా,లలిత మంచి ఫ్రెండ్స్ అవుతారు. అయితే తానే ఆ కవితలు రాసేది అన్న విషయాన్ని రాజాకు లలిత చెప్పదు. రాజాకు కవితలు రాసే రచయిత్రిగా కవితారాణిని పరిచయం చేస్తుంది లలిత. నిజానికి రాజా ప్రేమిస్తున్నది కవితలు రాసే కవితను. అయితే, కవితను చూసి ఆమెనే రచన చేస్తుందని భావించి, ప్రేమిస్తాడు. అసలు విషయం కవితకు తెలుస్తుంది. తన కోసం లలిత త్యాగం చేసిందనీ భావిస్తుంది. కవిత తండ్రికి ఓ మేనల్లుడుంటాడు. వాడు ఎలాగైనా కవితను పెళ్ళాడి తాను ఆస్తికి వారసుడు కావాలని ఆశిస్తూ ఉంటాడు. లలిత, కవిత ఒకరికొకరు త్యాగం చేసుకోవాలని భావిస్తారు. వారు తనతో ఆడుకున్నారని రాజా అనుకుంటాడు. వారిని అసహ్యించుకుంటాడు. చివరకు ఆ ఇద్దరి స్నేహం గొప్పతనం తెలుసుకున్న రాజా, తాను కవితలను రాస్తున్న వ్యక్తినే ప్రేమించానని చెప్పాలనుకుంటాడు. ఈ లోగా కవితను ఆమె బావ బలవంతంగా పెళ్ళాడాలని భావిస్తాడు. లలిత, కవిత ఇద్దరూ ఆపదలో పడతారు. వారిని రాజా వచ్చి రక్షిస్తాడు. అదే సమయంలో అనుకోకుండా రాజా చేతిలోని తాళి, లలిత మెడలో పడుతుంది. వారిద్దరికీ దేవుడు రాసి పెట్టాడని కవిత తండ్రి కూడా అంటాడు. లలిత, రాజా పెళ్ళి జరగడంతో అందరూ సంతోషిస్తారు.

Read Also: Aditi Rao Hydari: అనార్కలిగా న‌టించ‌టం.. హ్యాపీగా, చాలెంజింగ్‌గా అనిపించింది

ఇందులో రావు గోపాలరావు, బ్రహ్మానందం, సుధాకర్, శ్రీహరి, మనోరమ, శుభ, బాబూమోహన్, రవితేజ, రవిశంకర్, సుత్తివేలు, చిట్టిబాబు, అనంత్, సారథి, రమణమూర్తి, ఐరన్ లెగ్ శాస్త్రి, మూర్తి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు సత్యానంద్ సమకూర్చారు. కీరవాణి బాణీలకు అనువుగా వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి, ఎమ్.ఎమ్.కీరవాణి పాటలు పలికించారు. ఇందులోని “రోజ్ రోజ్ రోజ్ రోజాపువ్వా…”, “అందమా నీ పేరేమిటి…”, “చెప్పకనే చెబుతున్నది…”, “ఏం పిల్లది…”, “ఉత్తరాల ఊర్వశి…”,”అహో… ఒక మనసుకు నేడే పుట్టినరోజు…”, “ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా…” అంటూ సాగే పాటలు అలరించాయి.

‘అల్లరి ప్రియుడు’కు ముందు ఒకటి అరా పాటల్లో స్టెప్స్ వేసిన రాజశేఖర్ ఇందులో రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ లాగా ఫార్ములా మూవీతో సాగడం, పైగా పలు పాటల్లో ఆయన డాన్స్ చేయడం విశేషం. ఈ సినిమా ఘనవిజయంతో రాజశేఖర్ ఆ తరువాత కూడా పలు చిత్రాల్లో డాన్సులు చేసి అలరించారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గానూ మురిపించింది. ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకునిగా కె.రాఘవేంద్రరావు, ఉత్తమ సంగీత దర్శకునిగా కీరవాణి నంది అవార్డులు అందుకున్నారు. ఈ సినిమా అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని 1993 సంవత్సరం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. ఈ మూవీ విడుదలైన నెల రోజులకే యన్టీఆర్ తో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘మేజర్ చంద్రకాంత్’ విడుదలయింది. ఆ సినిమాకూ కీరవాణి స్వరకల్పన చేశారు. ఆ మూవీ సైతం ఘనవిజయం సాధించింది. అయినప్పటికీ ఆ వేవ్ ను తట్టుకొని ‘అల్లరి ప్రియుడు’ నిలవడం విశేషమనే చెప్పాలి.