3 Dead in Prakasam Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) స్నేహితులు. వీరు ముగ్గురు ఈరోజు తెల్లవారుజామున టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు బైక్‌పై వెళుతున్నారు. గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా గుండుగోలను జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గుండుగొలను జాతీయ రహదారి డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గంటా బాలు (18) మృతి చెందాడు. తీవ్ర గాయాలు అయిన ఇద్దరు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.