2nd FIR against Malayalam Actor Jayasurya: మలయాళ నటుడు జయసూర్యపై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నటి ఫిర్యాదు మేరకు ఆయనపై 354, 354A(A1)(I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. నటి నుంచి పూర్తి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత తిరువనంతపురంలో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆపై కేసును తోడుపుజ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. త్రిసూర్‌లోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును కూడా విచారించనుంది.
తిరువనంతపురం కంటోన్మెంట్ పోలీసులు నటుడు జయసూర్యపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో వాష్‌రూమ్ దగ్గర తనపై లైంగిక దాడి జరిగిందని కొచ్చి స్థానిక నటి ఫిర్యాదుపై తొలి కేసు నమోదైంది. గురువారం జయసూర్యపై నటి సోనియా మల్హర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2013లో తొడుపుజలో షూటింగ్ సందర్భంగా తనను ఊహించని విధంగా పట్టుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ సంఘటన తర్వాత తనకు అవకాశాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదిక తర్వాత తనకు జరిగిన అవమానాన్ని చెప్పాలనిపించిందన్నారు.
Also Read: Kangana Ranaut: నటిగా ఉండడం ఇష్టం లేదు: కంగనా
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు నటీమణులు తాము క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామని, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారని కమిటీ వెల్లడించింది. ఈ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్నారు. ఇప్పటి వరకు పలువురు సినీ తారలు, నిర్మాతలు సహా 17 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్ సహా జయసూర్య, సిద్ధిఖీ, మణియం పిళ్ల రాజు తదితర మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి.