Site icon NTV Telugu

Durga Idol History: నవరాత్రి స్పెషల్: 258 ఏళ్లుగా నిమజ్జనం కానీ దుర్గామాత విగ్రహం!

Varanasi Durgabari Temple

Varanasi Durgabari Temple

Durga Idol History: నవరాత్రి అంటే మొదట గుర్తుకు వచ్చేది దుర్గామాత. మీకు తెలుసు కదా.. అమ్మవారి విగ్రహాలను దుర్గాపూజ ముగియగానే నదీజలాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ అని. కానీ దాదాపు 258 ఏళ్లుగా నిమజ్జనం చేయకుండా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గామాత ఎక్కడ ఉందో తెలుసా. ఇంతకీ ఈ పురాతన ఆలయం విశిష్టత, పురాణ కథ, ఎక్కడ ఉందో, ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: CM Chandrababu: గూగుల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, యాక్సంచర్‌.. ఐటీ హబ్‌గా విశాఖ!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అమ్మవారి దర్శనం..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చారిత్రక దుర్గబరి ఆలయంలో ఏర్పాటు చేసిన అరుదైన దుర్గాదేవి మట్టి విగ్రహం వెనుక ఒక విశేషమైన కథ ఉంది. ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా క్రీ.శ. 1766లో ఏర్పాటు చేశారని ఇక్కడి వారు చెబుతున్నారు. నాటి నుంచి ప్రతి ఏడాది దేవీ నవరాత్రులు పూర్తయిన తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రయత్నించారు. అయితే ప్రతీసారి ఏదో ఒక అవాంతరం జరగడం లేదా విగ్రహం నిమజ్జనం కాకుండా ఆగిపోతున్నట్టు స్థానికులు చెబుతారు.

పలు పురాణాల ప్రకారం.. సాక్షాత్తు దుర్గాదేవి ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదని ఆదేశించిందని భక్తులు విశ్వసిస్తారు. నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించిన పూజారులకు, కలలో కనిపించి తాను ఎప్పటికీ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట. అందుకే నాటి నుంచి ఈ విగ్రహాన్ని శాశ్వత విగ్రహంగా పరిగణించడం మొదలుపెట్టారు. చరిత్ర సంప్రదాయం మేళవించిన ఈ విగ్రహం కేవలం మట్టి ప్రతిమ మాత్రమే కాకుండా, అనేక తరాల భక్తికి విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది.

వారణాసిలోని దుర్గబరి ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదని, ఇది నిమజ్జనం కాని దుర్గామాత విగ్రహం ద్వారా అచంచలమైన విశ్వాసాన్ని శతాబ్దాల సంప్రదాయాన్ని తెలియజేస్తుందని భక్తులు చెబుతున్నారు. 1766 నుంచి నేటి వరకు తరతరాలుగా భక్తుల పూజలను అందుకుంటూ నిత్యం కరుణను పంచుతున్న ఈ మట్టి ప్రతిమ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం అని అంటున్నారు.

మట్టితో తయారు చేసిన విగ్రహం..
ఈ విగ్రహాన్ని 258 ఏళ్లు క్రితం మట్టితో తయారు చేశారు. నాటి నుంచి దీనిని నిమజ్జనం చేయకుండా ఉండటం ఒక అద్భుతంగా భక్తులు భావిస్తున్నారు. ఆలయ అధికారులు, పూజారులు విగ్రహం శిథిలం కాకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది దుర్గాపూజ సమయంలో ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి నవరాత్రులు ముగిశాక నిమజ్జనం చేయాల్సిన భాగాలను (కొన్ని చిన్నపాటి ఆభరణాలు లేదా భాగాలను) మాత్రమే నిమజ్జనం చేస్తారని చెబుతున్నారు. ప్రధాన విగ్రహం మాత్రం ఆలయంలోనే శాశ్వతంగా ఉంటుంది. పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని, ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా మారిందని చెబుతున్నారు.

READ ALSO: Bathukamma Festival: 9 రోజుల బతుకమ్మ పండుగ.. ఇక్కడ మాత్రం 7 రోజులే.. !

Exit mobile version